కెప్టెన్ ప్రియ, బిగ్ బాస్ మార్క్ రాజకీయం.?

ఈ సీజన్ మొత్తానికీ కెప్టెన్ అయ్యే అవకాశాన్ని ప్రియ కోల్పోయింది. కానీ, అది పాత విషయం. ఇప్పుడామె కెప్టెన్ అయిపోయింది. అదెలా.? బిగ్ బాస్ రియాల్టీ షోలో రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్. అదంతే. సీనియర్ నటి ప్రియ, ఈ రియాల్టీ షోకి ఓకే చెప్పడం నుంచే అసలు రాజకీయం మొదలైందనే చర్చ జరుగుతోంది.

లహరి బిగ్ హౌస్ నుంచి ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో ఎవరికీ తెలియదు. ఆమె చుట్టూ రవి, ప్రియ ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు. నిజానికి, లహరి విషయంలో రవి, ప్రియ చేసిన ఓవరాక్షన్ నేపథ్యంలో రవి లేదా ప్రియ.. ఎవరో ఒకరు హౌస్ నుంచి ‘గెటౌట్’ అయిపోవాలి. కానీ, అలా జరగలేదు.

షో రన్నర్ అనే స్థాయిలో రవి రాజకీయాలు ప్లే చేస్తున్నాడు హౌస్‌లో. మరోపక్క ప్రియ కూడా అంతే. వాస్తవానికి బిగ్ బాస్ ద్వారా ప్రియ చాలా బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకుంటోంది. సినిమాల్లో నటిగా ఆమె సంపాదించిన పేరు ప్రఖ్యాతులు వేరు, ఇక్కడ ఆమె నేచర్ వేరు. బిగ్ బాస్ అంటేనే అంత.

ప్రియకి ఓ స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేయడం, దానికి అనుగుణంగా ఆమె నటిస్తుండడం, ఆమె చుట్టూ రకరకాల రాజకీయాల్ని బిగ్ బాస్ ప్లే చేస్తుండడం.. ఇలా అనిపిస్తోంది బిగ్ బాస్ వ్యూయర్స్‌కి. బిగ్ హౌస్‌లో ఏమైనా జరగొచ్చు.. అదీ బిగ్ బాస్ ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే తప్ప, ఇందులో రియాల్టీ నిల్.