Buddha Venkanna Arrested : టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మీదా, మంత్రి కొడాలి నాని మీదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. అంతకు ముందు మంత్రి కొడాలి నాని, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా బుద్ధా వెంకన్న రెచ్చిపోయారు.
రాజకీయ నాయకులు పరస్పరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం మామూలే. అయితే, డీజీపీ లాంటి ఉన్నత పదవుల్లో వున్న వ్యక్తుల మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పుడు బుద్ధా వెంకన్న పరిస్థితి ఏమవుతుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు ఇంటి గేటులోకి వస్తే, కొడాలి నానిని చంపేస్తానని కూడా బుద్ధా వెంకన్న హెచ్చరించిన దరిమిలా, వైసీపీకి చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా, బుద్ధా వెంకన్న అరెస్టుపై టీడీపీ శ్రేణులు గుస్సా అవుతున్నాయి.
కాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయకుండా, ఈ కాసినో కుంభకోణాన్ని వెలికి తీసిన టీడీపీ మీద కక్ష సాధింపు చర్యలేంటన్నది టీడీపీ వాదన. ఎవరి గోల ఎలా వున్నా, రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయ వ్యవహారాలు నడుస్తున్నాయి. పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత బెయిల్ తెచ్చుకోవడం.. తిరిగి ఇవే ఘటనలు పునరావృతమవుతుండడం.. ఇదో ప్రసహనంగా మారిపోతోంది.
అంతిమంగా, పోలీసు వ్యవస్థ ఈ తరహా రాజకీయాల కారణంగా అభాసుపాలవుతోందనే విమర్శలు లేకపోలేదు.