నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అఖండ’. వీరి కలయికలో రూపొందుతున్న మూడవ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలను మరింత పెంచేలా భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. తెలుగులో అంటే బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ కారణంగా సినిమా మీద హైప్, క్రేజ్ క్రియేట్ అవుతూ బిజినెస్ గట్టిగా కారుగుతోంది. ఎన్నడూ లేని విధంగా సినిమా హక్కులను రికార్డ్ రేటు పెట్టి కొంటున్నారు. ఇది పూర్తిగా బాలయ్య స్టార్ డమ్ అనే అనాలి. అయితే హిందీలో కూడ సినిమా మంచి స్థాయిలో బిజినెస్ చేసింది.
హిందీ డబ్బింగ్ హక్కులను 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. బాలయ్య గత చిత్రాలు వేటికీ ఇంత పెద్ద డీల్ దొరకలేదు. ఇదే రికార్డ్ ధర. మరి ఈ సినిమాకే ఎందుకు ఇంత రేటు అంటే అందుకు కారణం బోయపాటి శ్రీను. బాలకృష్ణ అంటే హిందీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ బోయపాటి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. బోయపాటికి హిందీలో మాంచి మాస్ క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు అంటే అక్కడి ప్రేక్షకులు ఎగబడి చూసేస్తుంటారు. ఆయన చిత్రాలు యూట్యూబ్ నందు మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ‘సరైనోడు, జయ జానకి నాయక, వినయ విధేయ రామ’ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ బాగా హిట్ అయ్యాయి. ఆయన సినిమాల్లోని మాస్ మసాలా కంటెంట్ అంటే హిందీ జనం చెవి కోసుకుంటారు. ఆ క్రేజ్ మూలంగానే ‘అఖండ’ హిందీ రైట్స్ 14 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడవ్వడం జరిగింది.