అమరావతి రైతుల్ని కెలికిన బొత్స.! ఇరకాటంలో జగన్ సర్కార్.!

అమరావతి రైతులతో చర్చించాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యానారాయణ అనడమేంటి.? అమరావతి కోసం రైతులు భూములిస్తే, ఆ అమరావతికి సంబంధించిన విషయమై ప్రభుత్వం, రైతులతో కాకుండా ఇంకెవరితో చర్చిస్తుంది.? మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన అమరావతిని ముంపు ప్రాంతంగా అభివర్ణించి వివాదాల్లోకెక్కారు. బొత్స ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చుగాక, కానీ.. విషయం మాత్రం అమరావతి రైతులకు ప్రభుత్వం వ్యతిరేకం.. అన్నట్టు తయారవుతోంది పరిస్థితి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా అమరావతి కోసం రైతులు తమ భూముల్ని త్యాగం చేశారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆ రైతుల మాటున కొందరు టీడీపీ నేతలు కోట్లు దండుకుని వున్నారా.? అన్నది వేరే చర్చ. ఆ వ్యవహారాన్ని ప్రభుత్వమే బయటపెట్టాలి. కానీ, ఇప్పటిదాకా ప్రభుత్వం ‘కొండను తవ్వి ఎలుకని పట్టిన చందాన’ కూడా అమరావతిలో కుంభకోణాన్ని బయటపెట్టలేకపోయింది.

అది ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు హయాంలో అమరావతి పేరుతో జరిగిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు అండ్ టీమ్ పబ్లిసిటీ కోసమే కోట్లు ఖర్చయ్యాయి. ఆ లెక్కలన్నిటినీ బయటకు తీసుకొచ్చి, టీడీపీ నేతల్ని బోనెక్కించాల్సిన జగన్ సర్కార్, చేష్టలుడిగా చూస్తోందన్న విమర్శలు లేకపోలేదు. అమరావతి వివాదంలో రైతుల అంశం ప్రత్యేకం. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో కొందరు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు.. అదీ మనో వేదన కారణంగా. రాజధాని అమరావతికి గతంలో మద్దతిచ్చిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పెట్టి, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దాంతో, రైతుల్లో ఆవేదన బయల్దేరింది. ఆ రైతుల్ని ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మంత్రిగా బొత్స, వివాదాన్ని రాజేయడం కంటే, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తే మంచిది. బొత్స వ్యాఖ్యలతో రైతులు గుస్సా అవుతున్నారు. మంత్రిపై రైతులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.