మంత్రి బొత్స సత్యనారాయణ, త్వరలో మంత్రి పదవికి దూరం కాబోతున్నారన్న చర్చ మీడియాలో జోరుగా సాగుతోంది. రాజ్యసభకు వెళ్ళాలనే ఆలోచన ఆయనలో బలంగా వుందట. ఈ కారణంగానే ఆయన మంత్రి పదవిని సైతం వదులుకోవాలనుకుంటున్నారట. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన నాయకుడిగా బొత్సకు గుర్తింపు వుంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగింది బొత్స కుటుంబం. అయితే, ఇప్పుడు బొత్స అంటే ఆయనొక్కరు మాత్రమే. బొత్స కుటుంబీకుల్లో చాలామంది ఒకప్పుడు యాక్టివ్‌గా వున్నా, ఇప్పుడు సైలెంటయ్యారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా, విజయమ్మపైనా, షర్మిలపైనా, వైఎస్ జగన్ పైనా తీవ్ర విమర్శలు చేసిన బొత్స, వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక మాత్రం వైఎస్ జగన్‌కి విధేయుడిగా మారిపోయారు. పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేశారు, చేస్తూనే వున్నారు.
పార్టీ వాదనల్ని వివిధ వేదికలపై బలంగా వినిపించడంతోపాటుగా, ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అమరావతి వివాదంలో కావొచ్చు, మరో వివాదంలో కావొచ్చు.. విపక్షాల విమర్శలకు మంత్రి బొత్స తనదైన శైలిలో సమాధానం చెబుతూ వచ్చారు.
కాగా, రెండున్నరేళ్ళలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ వుంటుందనీ, అందులో మెజార్టీ భాగం కొత్తవారికి అవకాశం దక్కుతుందని ముఖ్యమంత్రి అవుతూనే వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వాలనీ, తనను రాజ్యసభకు పంపాలని బొత్స, ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారట.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం అందుకు సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వ్యవహారంపై ఇంతవరకు ఎక్కడా బొత్స పెదవి విప్పలేదు. మంత్రి వర్గంలో సీనియర్ల అవసరమేంటో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు గనుక, బొత్సని వదులుకోకపోవచ్చన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.