పాండమిక్ తర్వాత కోలుకున్న ఒకే ఒక్క సినీ ఇండస్ట్రీ సౌత్ ఇండస్ట్రీ. తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు వేగం పుంజుకోగా హీరోలందరూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం తడబడుతూనే ఉంది. సినిమా హాళ్లు మళ్లీ మూతబడ్డాయి. కథల కొరత, దర్శకుల లేమి అయితే ఎప్పటినుండో వెంటాడుతూనే ఉంది. కొత్తదనాన్ని కోరుకుంటున్న హిందీ ఆడియన్స్ అయితే సౌత్ సినిమాల వైపు విశేషంగా ఆకర్షితులవుతున్నారు.
అందుకే అక్కడి హీరోలు దక్షిణాది కథలు, దక్షిణాది దర్శకుల మీద ఆధారపడుతున్నారు. ఇప్పటికే పలు సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అవుతుండగా ఇప్పుడు మరొక తమిళ చిత్రం రీమేక్ కానుంది. అదే ‘అన్నియన్’. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపొలేని సినిమాగా నిలిచిపోయింది. తెలుగులో ‘అపరిచితుడు’గా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమానే ఇప్పుడు రణ్వీర్ సింగ్ రీమేక్ చేస్తున్నారు. 2005లో వచ్చిన ఈ సినిమాను 16 ఏళ్ల తరవాత హిందీ వాళ్ళు రీమేక్ చేస్తున్నారంటే మన సౌత్ కథల క్వాలిటీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ రీమేక్ ను శంకర్ డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే షారుక్ ఖాన్ అట్లీతో సినిమా చేసే సన్నహాల్లో ఉన్నారు. తెలుగు నుండి రీమేక్ అవుతున్న ప్రతి కథని తెలుగు దర్శకులే డైరెక్ట్ చేస్తున్నారు. దీన్నిబట్టి హిందీ హీరోలు సౌత్ కథలు, దర్శకుల మీద ఎంతగా ఆధారపడ్డారో అర్థం చేసుకోవచ్చు.