ఇలాగైతే బీజేపీ, ‘నోటా’ ముందూ ఓడిపోతుందేమో.!

BJP's Tough Fight With NOTA In Tirupathi

BJP's Tough Fight With NOTA In Tirupathi

తిరుపతి ఉప ఎన్నికలో రాజకీయ లబ్ది కోసం భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో మతపరమైన రాజకీయాలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా బీజేపీ ముఖ్య నేతలు, తప్పుడు పోస్టులతో అధికార వైసీపీ మీద బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల సర్వ్రతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధం ఘటన, రామతీర్థంలో రాములోరి విగ్రహం ధ్వంసం ఘటన.. వంటివాటిపై అత్యుత్సాహపూరిత వ్యాఖ్యలు చేస్తూ, తిరుపతి ఉప ఎన్నికల వేళ ‘మతం’ ముసుగులో రాజకీయాలు చేస్తుండడం నిజానికి ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఈ స్థాయికి దిగజారి బీజేపీ సాధించేదేంటి.? అన్నదే అసలు ప్రశ్న ఇక్కడ. తాజా అంచనాల ప్రకారం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ పడాల్సింది నోటాతో మాత్రమేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మిత్రపక్షం జనసేన సైతం, బీజేపీ చేస్తున్న ఈ తరహా ప్రచారం పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్లే కనిపిస్తోంది.

కేంద్రంలో అధికారం తమ చేతుల్లోనే వున్నప్పుడు, బీజేపీ.. ఆయా ఘటనలపై ఎందుకు వేగంగా స్పందించలేకపోయిందన్నది సాధారణంగానే తలెత్తే ప్రశ్న. అంతర్వేది రథం దగ్ధం ఘటనను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఆ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం వైఫల్యం సుస్పష్టం. దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం మీద వున్న ఫోకస్, దేవాలయాల భద్రత మీద ప్రభుత్వానికి లేకుండా పోయిందన్న విమర్శ భక్తుల నుంచి వినిపిస్తున్న మాట వాస్తవం. అయితే, ఈ వైఫల్యాల్ని ప్రజా క్షేత్రంలో ఎండగట్టాల్సిన బీజేపీ, కేవలం పబ్లసిటీ స్టంట్లకే పరిమితమైంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఆ ఘటనల్ని వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న తీరు అత్యంత హాస్యాస్పదం.