తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికు సంబంధించి హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు. వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టకోగలమన్న ధీమానే కాదు, భారీ మెజార్టీ సాధిస్తామని చెబుతోంది ఫ్యాను పార్టీ. వైసీపీ, టీడీపీలను కుటుంబ పార్టీలుగా అభివర్ణిస్తోన్న బీజేపీ, జనసేన మద్దతుతో తాము గెలుస్తామంటోందిగానీ.. అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించలేదు. ఇక, టీవీ ఛానళ్ళలో చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుతూ, బీజేపీ నేతలు పదే పదే తిరుపతి అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు. అసలు తిరుపతికి బీజేపీ ప్రత్యేకంగా చేసిందేంటి.? పెద్ద నోట్ల రద్దు సమయంలో టీటీడీ హుండీల్లో పడ్డ పాత నోట్ల విషయమై ఎంత వివాదం చెలరేగిందో చూశాం. తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి జీఎస్టీ వద్దు మొర్రో అని భక్తులు, ప్రభుత్వాలు వేడుకుంటున్నా వదలడంలేదు కేంద్రం.
వసతి సముదాయాల్లో రూమ్ అద్దెల విషయంలోనూ జీఎస్టీ వెసులుబాట్లను భక్తులు అడుగుతున్నారాయె. ఇవేవీ అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలే కావన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోంది. అవన్నీ పక్కన పెడితే, ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి హామీ ఇచ్చింది తిరుపతి వేదికగానే. ఏమయ్యింది ఆ ప్రత్యేక హోదా.? వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల జాబితాలో చిత్తూరు జిల్లా కూడా వుంది. మరి, ఆ దిశగా కేంద్రం ఏం చేస్తున్నట్లు.? తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి సహా అనేక వ్యవహారాల్లో ఏపీ బీజేపీ, తమ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి ఏమన్నా సాధించగలిగిందా.? అంటే లేదనే చెప్పాలి. ‘అభివృద్ధిపై చర్చకు రెడీ’ అని బీజేపీ నేతలు అంటున్నారుగానీ, అభివృద్ధి అంటే ఏంటన్న ప్రశ్నకు బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదు. కానీ, బీజేపీకి ఆంధ్రపదేశ్‌లో.. అందునా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్లు కావాలి. ఇదెలా సాధ్యం.?