హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ బీజేపీ కార్యకర్త గంగల శ్రీనివాస్ యాదవ్ చికిత్స పొందుతూ మృతిచెందారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ శ్రీనివాస్ యాదవ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శరీరం 60 శాతానికి పైగా కాలిపోవడంతో శ్రీనివాస్ కోలుకోవడం చాలా కష్టమైందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. వైద్యులు సర్వశక్తులు ఒడ్డినా ఆయన్ని కాపాడలేకపోయారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడానికి చెందిన శ్రీనివాస్… ఇబ్రహీంపట్నలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ వరకు చదివారు. మూడేళ్లుగా కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. బండి సంజయ్ కి విరాభిమాని. దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఆయన్నిపోలీసులు అరెస్టు చేయడంతో ఈ దారుణానికి ఒడిగడ్డాడు. ఆత్మహత్య యత్నానికి ఒడిగడుతూ… ‘అన్నా.. బండి సంజయ్ అంటే నాకు ప్రాణం. నా గుండె కోసిస్తా. పార్టీ కోసం ప్రాణమిస్తా’అంటూ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ కామెంట్స్ ని పలు టీవీ చానల్స్ ప్రసారం చేశాయి.