ఖేల్ ఖతం: జనసేనతో తెగతెంపులకు సిద్ధమైన బీజేపీ

BJP

BJP To Cut Ties : ‘మాకు పొత్తు జనంతో.. అవసరమైతే జనసేనతో.. సింగిల్‌గా అధికారంలోకి రావాలనుకుంటున్నాం.. దేశానికి మోడీ ప్రభుత్వం చాలా చేసింది.. రాష్ట్రానికి కూడా చాలా చాలా చేసింది. ఆ మంచి పనులు చెప్పుకునే అధికారంలోకి వస్తాం..’ అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోము వీర్రాజు మాటల్ని చూస్తే, జనసేనతో పొత్తుని బీజేపీ తెగతెంపులు చేసుకోవాలని డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది. ‘టీడీపీతో కలిసి వెళ్ళే ప్రసక్తే లేదు..’ అని ఖరాఖండీగా చెప్పేసిన సోము వీర్రాజు, టీడీపీతో జనసేన కలిసి వెళుతుందా.? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘ఆ విషయం మీరు జనసేన పార్టీని అడగాలి..’ అంటూ మీడియా మీద గుస్సా అయ్యారు.

సొంతంగా ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి వుందా.? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసేసింది.? అంటే, ప్చ్.. ఏమీ లేదనే సమాధానమే వస్తుంది.

ప్రత్యేక హోదా ఎగ్గొట్టారు.. రైల్వే జోన్ ఇంకా తేలలేదు.. పోలవరం ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోయింది. కడప స్టీలు ప్లాంటు సహా చాలా వ్యవహారాల్లో మోడీ సర్కార్ ‘మాకేటి సంబంధం’ అన్నట్టు వ్యవహరిస్తోంది.

నిజానికి, బీజేపీతో కలిసి వెళ్ళడం జనసేనకే నష్టం. 2024 ఎన్నికల్లో జనం ముందుకు వెళ్ళి, మిత్రపక్షం బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందంటే పవన్ ఏం చెప్పగలుగుతారు.? సో, బీజేపీ దూరమైతే.. అది జనసేనకే లాభం. మరి, బీజేపీ ఏం చేస్తుంది జనసేనకు దూరమై.? బహుశా వైసీపీ పంచన చేరుతుందేమో.!