దేశం మీసం మెలెయ్యాల్సిందే.. అంటూ భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాధించాక.. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దేశానికి నరేంద్ర మోడీ అత్యద్భుతమైన పాలన అందిస్తారని అంతా ఆశించారు. తొలిసారి పార్లమెంటులో అడుగు పెడుతూనే ప్రధాని అయిన నరేంద్ర మోడీ, దేశాన్ని ఎంతో బాధ్యతగా ముందుకు నడిపిస్తారని ఆశించడంలో తప్పేముంది.? కానీ, ఆ ఆశలు అడియాశలయ్యాయి. కొన్ని విషయాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని, దేశ ప్రజలందరి మన్ననలూ పొందారు నరేంద్ర మోడీ. అందుకే, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చింది. కానీ, క్రమంగా బీజేపీ.. దేశాన్ని అమ్మేసే పనిలో వేగం పెంచింది. ‘వీలైతే అమ్మేస్తాం.. లేదంటే మూసేస్తాం..’ అని తెగేసి చెబుతున్నారు కేంద్ర మంత్రులు. అది ఉక్కు పరిశ్రమ కావొచ్చు.. లేదంటే ఎయిర్ ఇండియా కావొచ్చు.. మరో ప్రభుత్వ రంగ సంస్థ కావొచ్చు. ‘ప్రభుత్వం వ్యాపారం చేయదు..’ అంటూ ఇటీవల నరేంద్ర మోడీ గొప్ప మాటే చెప్పారు. మరి, పన్నులు వేయడమంటే ఏంటి.? వ్యాపారం కిందికే వస్తుంది ఇది కూడా. దీన్ని ఇంకో కోణంలో చూస్తే.. అది వేరే సంగతి.
ప్రభుత్వ రంగ సంస్థలు దేశ సామాజిక అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలకే రిజర్వేషన్లు వర్తిస్తాయి. అన్నిటినీ ప్రైవేటు పరం చేసేస్తే.. రిజర్వేషన్లకు అర్థమేముంటుంది.? ఆర్టీసీ బస్సు ఎక్కితే రవాణా ఛార్జీలు ఒకింత అందుబాటులో వుంటాయి. అదే, ప్రైవేటు బస్సు ఎక్కితే.. వాచిపోతుంది. ప్రభుత్వాసుపత్రికి వెళితే ఖర్చుండదు.. అదే ప్రైవేటు ఆసుపత్రికి వెళితే ఇంకేమన్నా వుందా.? చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. ఎయిర్ ఇండియా విషయమై తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికైతే ప్రభుత్వ రంగ సంస్థలే అమ్మేస్తున్నారు.. రేపు ప్రభుత్వాల్ని కూడా అమ్మేస్తారా.? అన్న ప్రశ్నకు బీజేపీ ఏం సమాధానం చెబుతుంది.?