తమిళనాడుపై బీజేపీ అస్త్రం.. ఇంకెన్ని వికెట్లు పడతాయో.!

Bjp Master Weapon on Tamilnadu Local Parties

Bjp Master Weapon on Tamilnadu Local Parties

ఒకటే అస్త్రాన్ని బీజేపీ మళ్లీ మళ్ళీ ప్రయోగిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.. ఈ ‘రాజకీయ అస్త్రాల’ కారణంగానేన్నది నిర్వివాదాంశం. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పరంగా చిన్న చిన్న అవకాశాలు దొరికినా, దాన్ని పెద్ద అవకాశంగా మార్చుకుని, అక్కడ పాగా వేయగలిగింది బీజేపీ. తమిళనాడు రాజకీయాలు వేరు. అక్కడ ప్రాంతీయ పార్టీలకు తప్ప, జాతీయ పార్టీలకు సీన్ వుండదు. అందుకే, అక్కడ డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వకుండా, తెరవెనుకాల కథ నడిపిస్తోంది కమలదళం.

అన్నాడీఎంకే ప్రస్తుతం అక్కడ అధికారంలో వున్నా, మొత్తం కథ నడిపేది బీజేపీనే. అంతలా జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూనే వెనక్కి తగ్గడం, తాజాగా శశికళ కూడా రాజకీయ సన్యాసం ప్రకటించడానికి తెరవెనుక బీజేపీ నడిపిన కథే కారణం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రాజకీయ పరిణామాలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. ఇంత చేసినా తమిళనాడులో బీజేపీ పాగా వేయగలుగుతుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. నిజానికి తమిళనాడులో ప్రతిపక్షం డీఎంకే చాలా బలంగా కనిపిస్తోంది. కరుణానిధి మరణం తర్వాత కూడా పార్టీ బలంగానే వుండడం బీజేపీకి కంటగింపుగా మారింది. అన్నాడీఎంకే పార్టీ అధికారంలో వున్నప్పటికీ, ఆ పార్టీలో ఇప్పుడు బలమైన నాయకుడు లేడు. పూర్తిగా బీజేపీ అండదండలతోనే అన్నాడీఎంకే అధికారాన్ని కొనసాగించగలుగుతోంది తమిళనాడులో. కానీ, ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో ఊహించలేం. ముఖ్యమంత్రి పళనిసామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం..

ఇద్దరిలో ఎవరూ అన్నడీఎంకే పార్టీని అధికారంలోకి తెచ్చేంత రాజకీయ బలం కలిగిలేరన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే బీజేపీకి కావాల్సింది. ముందు ముందు చాలా వికెట్లు పడబోతున్నాయి. ఆ వికెట్లు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ, వికెట్లను పడగొట్టేది మాత్రం బీజేపీనే. అక్కడ ఆ వ్యూహం వర్కవుట్ అయితే, ఆ వెంటనే తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఇంకాస్త అగ్రెసివ్‌గా వేలు పెట్టబోతోందని అంటున్నారు.