బీజేపీ, వైసీపీల నడుమ కనిపించని వార్ నడుస్తోంది. ఎలాగైనా రాష్ట్రంలో బలపడాలనే ఉద్దశ్యంతో భారతీయ జనతా పార్టీ నాయకులను బలంగా పోరాడమని పిలుపునిచ్చింది. ఏం జరిగినా కేంద్రం ఉందని, చూసుకుంటుందని, హైకమాండ్ మీద భరోసా ఉంచండని తెలిపారు రాష్ట్ర స్థాయి నేతలు. దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా బీజేపీ నాయకులు అందరూ వైసీపీ మీద, జగన్ పాలన మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో గట్టిగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అసత్యపు ప్రచారాలు చేసేవారి మీద ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలువురి మీద సీఐడీ కేసులు కూడ నమోదుచేసింది. ఎవరైనా అతిగా మాట్లాడుతున్నట్టు కనబడితే వారికి ఖాకీ ఎఫెక్ట్ తగులుతోంది.
ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి రూరల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం 11గంటల సమయంలో కొందరు సత్తెనపల్లి 8వ వార్డులోని సాయిబాబా ఆలయం పక్కనే ఉన్న శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఒంగోలు పోలీసులమని చెప్పి ఆయన్ను తీసుకెళ్లారుట. అలా తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆయన మొబైల్ ఆగిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, సోషల్ మీడియాలో ప్రచారాల నేపథ్యంలో పోలీసుల పేరుతో బీజేపీ నేతను తీసుకెళ్లడం , ఆయన ఆచూకీ తెలియకపోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
బీజేపీ నేతలు మాత్రం పోలీసుల పేరు చెప్పి ఎవరో కిడ్నాప్ చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కారణంగానే ఆయన్ను కిడ్నాప్ చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే వెంటనే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సైతం కొందరు పోలీసుదుస్తులు లేకుండా వచ్చి పోలీసులమని చెప్పి తీసుకెళ్లారని, ఇప్పుడేమో ఆచూకీ లేకుండా పోయిందని, వెంటనే శ్రీనివాసరావు ఎక్కడున్నారో బయటపెట్టాలని కన్నీరు మున్నీరవుతున్నారు.