ఇన్నాళ్లు ఏపీలో ఒక జాతీయ పార్టీగా ప్రవర్తిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు లోకల్ పార్టీ స్టైల్లో ఆలోచిస్తోంది. ఆంధ్రాలో లోకల్ పొలిటికల్ పార్టీల ఆలోచనలు ఎప్పుడూ కులం చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలే ఇక్కడ రాజకీయాలని, ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తుంటాయి. అందుకే బీజేపీ కూడ కులాల కుంపట్లను నెత్తికెత్తుకుంటోంది. ఏపీలోని బలమైన సామజిక వర్గాల్లో కాపు సామాజికవర్గం కూడ ఒకటి. కాపులను ప్రసన్నం చేసుకుంటే అధికారానికి దగ్గరకావొచ్చు అనే కాలుక్యులేషన్ ఒకటి ఉంది. అందుకే ప్రతి పొలిటికల్ పార్టీ కాపులను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటుంది.
ఇప్పుడు అదే పనిని బీజేపీ చేస్తోంది. అయితే ఇతర పార్టీల కంటే కొంచెం భారీగా. కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండేది గోదావరి జిల్లాల్లోనే. అక్కడ ఏ పార్టీ అయితే పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తుందో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కాపులను ప్రసన్నం చేసుకోవాలనేది సోము వీర్రాజు ప్లాన్. అందులో తొలిఅడుగుగా జనసేనతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు కాపుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల్లో కూడా గోదావరి జిల్లాల్లోని కాపు ఓట్లు ఆయనకు బాగానే పడ్డాయి. అందుకే బీజేపీ ఆయనతో జతకట్టింది. ఇది మొట్టి స్టెప్ మాత్రమే.
ఇప్పుడు రెండో స్టెప్ అమలవుతోందట. దీన్ని వీర్రాజుగారు అమలుచేస్తున్నారట. గత కొన్ని రోజులుగా ఆయన గోదావరి జిల్లాల్లో యాక్టివ్ గా ఉన్న కాపు సంఘాల నేతలకు,లోకల్ నాయకులను సంప్రదిస్తున్నారట. బీజేపీలో చేరితే పదవులు, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారట. అందుకు గ్యారెంటీ కార్డుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారును చూపిస్తున్నారట. పైన బీజేపీ రాజ్యం చేసినంత కాలం ఏపీలోని బీజేపీ నాయకులకు ఎలాంటి ఢోకా ఉండదని,అందాల్సిన ప్రయోజనాలు అన్నీ అందుతాయని అంటున్నారట. మరి మోదీని చూపించి వీర్రాజు వేస్తున్న గాలానికి ఎంతమంది చిక్కుతారో చూడాలి.