ఏపీ బీజేపీలో కొత్త రూల్ దించిన సోము వీర్రాజు.. హైకమాండ్ కూడ షాక్ అయ్యింది 

Somu Veerraju
భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు.  అదే ఆ పార్టీని ఈనాడు అగ్రస్థానంలో నిలబెట్టింది.  అంశం ఏదైనా సరే కింది స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు నాయకులంతా ఒకే మాట మీద ఉంటారు.  అందరూ ఒకే వ్యూహం అనుసరిస్తుంటారు.  హైకాండ్ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ పాటించాల్సిందే.  లేకుంటే చర్యలు తప్పవు.  అది మంచి పద్దతి కూడ.  అందుకే ఏదైనా అంశం మీద బీజేపీ స్టాండ్ ఏమిటనేది సులభంగా అర్థమైపోతుంటుంది.  కానీ ఈమధ్య ఏపీ రాజధాని అమరావతి విషయంలోనే ఆ పార్టీ రెండు నాలుకల ధోరణిని ప్రదర్శించింది.  పార్టీలోని కొందరు ఆరు నూరైనా అమరావతే రాజధాని అంటే ఇంకొందరు మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడారు.  చివరికి అధ్యక్షుడి హోదాలో కన్నా లక్ష్మీనారాయణ కూడా అమరావతికి అనుకూలంగా లేఖ రాశారు.  దీంతో బీజేపీకి టీడీపీ అనుకూల పార్టీ అనే పేరు పడింది.  
 
అందుకే హైకమాండ్ తక్షణ చర్యలకు పూనుకుంది.  కన్నాను తొలగించి అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించారు.  వీర్రాజు రావడంతోనే పార్టీ స్టాండ్ ఏమిటో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  బీజేపీ అమరావతికి అనుకూలమే కానీ రాష్ట్ర రాజధాని ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయమూ ఉండదని తేల్చి చెప్పింది.  అంటే అమరావతిని రాజ్యాంగబద్దంగా అడ్డుకోలేమని, రాజ్యాంగ విరుద్దమైన పనులు బీజేపీ చేయదని అర్థం వచ్చేలా స్టెట్మెంట్ ఇచ్చారు.  కానీ రైతులకు న్యాయం జరిగేలా పోరాడతామని అన్నారు.  ఇందులో చాలా తిరకాసే ఉన్నా కూడ పార్టీ నాయకులంతా దాన్నే పాటించాలి.  
 
కానీ కొందరు లీడర్లకు అది నచ్చలేదు.  బాహాటంగానే అమరావతికి మద్దతుగా మాట్లాడి పార్టీ విధానాన్ని ధిక్కరించారు.  అతనే వెలగపూడి గోపాలకృష్ణ.  పార్టీ స్టాండ్ ఏమిటో స్పష్టం చేశాక కూడా వెలగపూడి వ్యతిరేకంగా మాట్లాడటంతో సోము వీర్రాజు ఆగ్రహించారు.  నోటీసులు కూడా ఇవ్వకుండా క్రమశిక్షణా చర్యల కింద వెలగపూడిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు.  అలాగే అమరావతి గురించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ పత్రికలో వ్యాసం రాసిన ఓవీ రమణను కూడా హెచ్చరికలు లేకుండానే సస్పెండ్ చేశారు.  సోము వీర్రాజు తీసుకుంటున్న ఈ కఠిన చర్యలతో హైకాండ్ సైతం షాక్ అవుతోందట.  అయినా పార్టీ కోసమే చేస్తుండటం, వీర్రాజు చర్యలతో టీడీపీకి అనుకూలమనే మరక పోతుండటంతో అంతా మంచికే కదా అన్నట్టు మౌనంగా ఉన్నారు.