వైసీపీకి లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ.!

BJP Fighting for Second Place In Tirupathi

BJP Fighting for Second Place In Tirupathi

భారతీయ జనతా పార్టీ, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి రెండో స్థానాన్ని మాత్రమే ఆశిస్తోందా.? అంటే, ఔనని చెప్పక తప్పదు. ఎందుకంటే, మొదటి నుంచీ ఆ పార్టీ వైఖరి ఈ విషయంలో అనుమానాస్పదమే. ‘మేమే తిరుపతిలో గెలుస్తాం..’ అని పైకి గట్టిగా చెబుతున్నప్పటికీ, మిత్రపక్షం జనసేనతో వ్యూహాత్మక ‘వైరం’ సహా అనేక అంశాలు.. ఆ పార్టీ మొదటి స్థానానికి కాదు, రెండో స్థానానికే పోటీ పడుతోందన్న అభిప్రాయం అందరిలోనూ కలిగిస్తోంది. తిరుపతి నియోజకవర్గ పరిధిలో రెండో స్థానంలో వున్న టీడీపీని దెబ్బకొట్టి, ఆ స్థానాన్ని తాము కైవసం చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహం. అధికార వైసీపీ, తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెబట్టుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కష్టపడితే, అది కేవలం మెజార్టీ పెంచుకోవడానికి మాత్రమే. ఆ విషయం బీజేపీ అధినాయకత్వానికి తెలియకుండా వుంటుందా.? ఇక, బీజేపీ.. వైసీపీ మీద చేసే విమర్శల కంటే ఎక్కువగా టీడీపీ మీద చేస్తోంది.

మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట మార్చిన వైనం గురించి బీజేపీ నేతలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా దండగ.. అని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్నీ, ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు పొగిడిన విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది టీడీపీ. చంద్రబాబు, లోకేష్.. ఇలా అప్పట్లో టీడీపీ నేతలంతా ప్రత్యేక హోదా దండగని చెబుతూ, ప్రత్యేక ప్యాకేజీనే గొప్ప.. అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అలా వారితో చెప్పించింది బీజేపీనే అయినా, ఇప్పుడు.. ఆనాటి చంద్రబాబు అండ్ టీమ్ పలికిన పలుకుల్ని తమ రాజకీయ అస్త్రంగా తిరుపతిలో ప్రయోగిస్తోంది కమలదళం. ‘ఆ రెండు పార్టీలూ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. మాకేంటి సంబంధం.? మేం నెంబర్ వన్.. మేం పూర్తిగా మెజార్టీ మీదనే ఫోకస్ పెట్టాం..’ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ‘తిరుపతి వేదికగా నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.. మాట తప్పారు.. అది తిరుపతి నియోజకవర్గ ప్రజలకు తెలుసు..’ అని వైసీపీ నేతలు అంటున్నారు.