తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా తెలంగాణలో పుంజుకుంటున్నామని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పెట్రో మంట విషయమై ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి చెమటలు పట్టేస్తున్నాయ్.
కేసీయార్ దెబ్బకి తెలంగాణలో బీజేపీ శ్రేణులు అయోమయంలో పడిపోతున్నాయనడం అతిశయోక్తి కాదేమో. వ్యవసాయ చట్టాలు, రైతుల సమస్యలు, పెట్రో మంటలు.. ఇలా చాలా అంశాలకు సంబంధించి కేసీయార్, బీజేపీని కడిగి పారేస్తున్న తీరుతో బీజేపీ నేతల నోట మాట కరువవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 40 నుంచి 50 దాకా పెంచేసి, ఐదు నుంచి 10 రూపాయలు తగ్గిస్తే.. దాన్ని తగ్గింపు అంటారా.? అని నేరుగా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ నిలదీస్తున్న విషయం విదితమే.
కాగా, ఈ మొత్తం వ్యవహారంలో అడ్డంగా బుక్కయిపోతున్నది జనసేన పార్టీ కావడం గమనార్హం. జనసేనకు తెలంగాణ మీద పెద్దగా ఆశల్లేవుగానీ, ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఆశలే వున్నాయి. అవిప్పుడు అడియాసలుగా మారిపోయేలా వున్నాయి.
బీజేపీని వదిలించుకుంటే జనసేనకు వేరే దారి లేదు. ఒంటరిగా జనసేన ముందుకు వెళ్ళే అవకాశమూ లేదు. కాగా, తెలంగాణలో ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నామనే భావనలో వున్న బీజేపీ, తాజా పరిణామాలతో అవాక్కయ్యింది. ఆంధ్రప్రదేశ్ మీద ఆశలు పెంచుకున్న బీజేపీ అయితే, పెట్రో రగడతో పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.