దుబ్బాక.. దుబ్బాక.. దుబ్బాక.. ప్రస్తుతం బీజేపీ ఎజెండా అదే. గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ దుబ్బాక విజయాన్నే తమ ప్రధాన అస్త్రంగా వాడుతోంది. అధికార పక్షాన్ని ఓడించి.. దుబ్బాక గెలిచామని.. ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని చెబుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో తమ ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే.. దుబ్బాక ఉపఎన్నిక వరకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని అంతా అనుకున్నారు. కానీ.. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలుపు తెలంగాణ రాజకీయాలను తలకిందులు చేసింది. ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలన్నీ మారిపోయాయి.
బీజేపీకి టైమ్ వచ్చింది అని అంతా అనుకున్నారు కానీ.. ఆ టైమ్ కేవలం దుబ్బాక ఉపఎన్నికలో మాత్రమే గ్రేటర్ ఎన్నికలో కాదు.. అని అంటున్నారు. ఎందుకంటే.. గ్రేటర్ లో బీజేపీ గెలవడం అంత సులువు కాదు.. అనే ప్రశ్నలు కూడా ఎదురువుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక వేరు.. గ్రేటర్ ఎన్నికలు వేరు.. అందులోనూ దుబ్బాకలో ఓడిపోయాక… సీఎం కేసీఆర్ మరింత అప్రమత్తమయ్యారు. ఈసారి గ్రేటర్ లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురువుతోంది.
అది ఓకే కానీ.. బీజేపీకి వచ్చిన మరో పెద్ద సమస్య ఏంటంటే.. సొంత పార్టీ నుంచే వస్తున్న వ్యతిరేకత. ఆదిలోనే బీజేపీకి పెద్ద దెబ్బ పడింది. సొంత పార్టీ నేతలే పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారట. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు బీజేపీ నాయకులు.
అయితే.. దుబ్బాక ఉపఎన్నిక గెలుపు తర్వాత బీజేపీ టికెట్ కు గ్రేటర్ లో ఫుల్లు డిమాండ్ పెరిగింది. దీంతో టికెట్లను ఆశించిన వారికి కాకుండా.. టికెట్లను అమ్ముకున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. టికెట్ రానివారు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే కూకట్ పల్లలి బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. బీజేపీ కి గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేయొద్దంటూ వ్యతిరేక ప్రచారం కూడా మొదలు పెట్టారట కొందరు. ఇలా కార్పొరేటర్ల టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారంటూ వ్యతిరేక ప్రచారం చేస్తూ గ్రేటర్ లో బీజేపీకి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఓవైపు టీఆర్ఎస్ పార్టీ.. మరోవైపు సొంత పార్టీ కార్యకర్తల వ్యతిరేక ప్రచారం.. ఈ రెండింటిని ఎదుర్కొని బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం అనేది కత్తి మీద సాము లాంటిదే.