BJP : బీజేపీ కానుక: ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్ 50 రూపాయలే.!

BJP : రాజకీయాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. లేకపోతే, అధికారంలోకి రావాలన్న యావతో, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మందుబాబులకి బంపర్ ఆఫర్ ప్రకటించింది.. చీప్ లిక్కర్ 50 రూపాయలకే ఇస్తామని ప్రకటించింది. ముందైతే అధికారంలోకి రాగానే చీప్ లిక్కర్ ధరని 75 రూపాయలకు తగ్గిస్తారట. రాష్ట్ర ఆదాయం బావుంటే, చీప్ లిక్కర్ 50 రూపాయలకే అందేలా చేస్తారట.

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది బీజేపీ తీరు. చేతనైతే, రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పాలి. అంతేగానీ, తక్కువ ధరకు చీప్ లిక్కర్ అందుబాటులోకి తెస్తామనడమేంటి.? మందుబాబుల ఓట్లకు రాజకీయ పార్టీలు ఎలా బానిసత్వం చేస్తున్నాయో, మందుబాబుల్ని ఎంత చులకనగా రాజకీయ పార్టీలు చూస్తున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరల విషయమై చాలాకాలంగా వివాదం వుంది. మద్యనిషేధమన్నారు, మద్యం రేట్లను పెంచేశారు. ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని నియంత్రించలేక.. రాష్ట్రంలో మద్యం రేట్లను తగ్గించారు. రేట్లు పెంచడం ద్వారా మందు బాబులకు షాకిచ్చామని చెప్పుకున్న జగన్ సర్కార్, రేట్లు తగ్గించి మందుబాబులకు పండగ లాంటి వార్త చెప్పింది.

మద్యం.. అన్ని అనర్ధాలకీ కారణం. మద్యం కారణంగానే హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. మద్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఆ మద్యం కారణంగానే ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఆ మద్యం వల్లనే ప్రజల ఆర్థిక స్థితిగతులు నాశనమైపోతున్నాయి. కానీ, ఆ మద్యం మీద ప్రభుత్వాలకి యావ తగ్గడంలేదు. రాజకీయ పార్టీలూ ఆ మద్యం పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయక తప్పడంలేదు.