గత కొద్దీ రోజులుగా దూసుకుపోతున్న బిట్ కాయిన్‌పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరగడాన్ని ఆయన బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో క్లాసిక్ ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఓ జాతీయ ఛానెల్‌కు బుధవారం నాడు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి..గత ఏడాది మొదట్లో పది వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ నేడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది. వాస్తవంగా దీని వల్ల ఎటువంటి విలువా చేకూరదు.
ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కూడా కష్టమే. అయినా కానీ బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో దీని విలువ మరింత పెరుగుతుందని మదుపర్లు నమ్ముతున్నారు కాబట్టే బిట్ కాయిన్‌పై ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది. ఈ వైఖరి ఓ బుడగ లాంటిది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2008 ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని ముందే పసిగట్టిన ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్. ఒకవేళ ప్రపంచం మరో సంక్షోభంలో చిక్కుకుంటే బిట్ కాయిన్, టెస్లా విలువ బుడగ మాదిరిగా దూసుకెళ్తాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బుడగ వంటి మార్కెట్ల ధోరణి, ద్రవ్యపరపతి విధానం సరళతరం, తక్కువ వడ్డీరేట్లు ఇవన్నీ బిట్ కాయిన్ విలువ పెరుగడానికి కారణం అన్నారు.