బీజేపీకి వెన్నుపోటు పొడిచిన బీహార్ సీఎం నితీష్ కుమార్.?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచారట. బీహార్‌లో బీజేపీ – జేడీయూ నేతృత్వంలోని కూటమి అధికారంలో వున్న విషయం విదితమే. గతంలో కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి నితీష్ కుమార్ రాజకీయం చేశారు.. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆ రెండు పార్టీలకూ షాకిచ్చి, బీజేపీతో కలిశారు.

ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓసారి వెన్నుపోటు పొడవడం అలవాటైతే, అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తారనడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ నిదర్శనం. అయినాగానీ, ఆయన తప్ప ఇంకెవరూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి పనికిరారా.? అంటే, అక్కడి రాజకీయాలు అలాగే వుంటాయ్ మరి.!

బీజేపీతో తెగతెంపులు చేసుకుని మళ్ళీ ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో జతకట్టారు జేడీయూ నేత నితీష్ కుమార్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు, ఆర్జేడీ – కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంటే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, మళ్ళీ అదే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబోతున్నారన్నమాట.

‘ఇంత దారుణమైన రీతిలో వెన్నుపోటు పొడుస్తావా.?’ అంటూ నితీష్ కుమార్ మీద మండిపడుతోంది బీజేపీ. నితీష్ కుమార్‌కి క్లీన్ చిట్ వుంది రాజకీయాల్లో. ఆయన మీదకు ఈడీ లేదా సీబీఐలను బీజేపీ ప్రయోగించలేదు, ప్రయోగించినా ఫలితం వుండదు. మింగలేక కక్కలేక అన్నట్టు తయారైంది బీజేపీ పరిస్థితి.

మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేని అడ్డం పెట్టుకుని ఉద్ధవ్ ధాక్రే సర్కారుని బీజేపీ కూల్చేస్తే, నితీష్ కుమార్.. ఇంచు మించు అదే తరహాలో, బీజేపీని నవ్వులపాలు చేశారు బీహార్‌లో. భూమి గుండ్రంగా వుంటుంది.. రాజకీయాలూ అంతే. తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వస్తుంది వ్యవహారం.