ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఎవ్వరితోనైనా అవసరం రావచ్చు. మనం అనుకుంటాం.. ఎహె.. ఆయనతో మనకేంటి పని అని. కానీ.. రేపే ఆయనతో నీకు పని పడొచ్చు. అందుకే.. ఈ ప్రపంచంలో ఎవ్వరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఊహించలేం. సేమ్ టు సేమ్.. రాజకీయాల్లనూ అదే వర్తిస్తుంది. ఒక పార్టీకి మరో పార్టీ అవసరం ఎప్పటికైనా రావచ్చు. అందుకే కొన్ని పార్టీలు ఏం చేస్తాయి అంటే.. బయటికి నుంచి ఒక పార్టీని విమర్శించినా.. లోపల రెండింటి సిద్ధాంతం ఒకటే ఉంటుంది.
కొన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేసి గెలవలేవు. అప్పుడు వేరే పార్టీతో పొత్తులు పెట్టుకొని మరీ.. ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. రాజకీయాల్లో ముఖ్యంగా ఉండాల్సింది పొత్తు. అది లేకుంటే ఏం చేయలేం. ప్రాంతీయ పార్టీ అయితే ఖచ్చితంగా ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో మంచి సంబంధాలు నెరపాలి. లేదంటే ప్రాంతీయంగా ఆ పార్టీకి ఏ పనులూ కావు.
అయితే.. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల చూపు మాత్రం ఏపీవైపే పడింది. ఎందుకంటే.. ఏపీలో ఉన్న ఎంపీల సంఖ్య వల్ల. ఒక్క వైసీపీ పార్టీకే 20కి పైగా లోక్ సభ ఎంపీలు ఉన్నారు. అలాగే ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. దీంతో కేంద్రం కూడా వైసీపీ వైపే చూస్తోంది. భవిష్యత్తులో ఎంపీల అవసరం కావాల్సి వస్తే వైసీపీ మద్దతు ఇవ్వాలి కదా.. అందుకే కేంద్రం కూడా వైసీపీతో దోస్తీ చేస్తోంది.
ఈనేపథ్యంలోనే త్వరలో రాబోయే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం బీజేపీ పలురకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే.. బీజేపీకి లోక్ సభలో ఫుల్లు మెజారిటీ ఉంది కానీ.. రాజ్యసభలో లేదు. అందుకే… వైసీపీ సాయం కోసం చేతులు చాపుతోంది బీజేపీ.
ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం బీజేపీతో పాటుగా పలు పార్టీలు కలిసి ఎన్డీఏ అభ్యర్థిని బరిలోకి దించనున్నాయి. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాని బీజేపీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే జేడీయూ నేతను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా నిలబెట్టనున్నారట. దానికోసమే.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఫోన్ కాల్ వచ్చిందట. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఏకగ్రీవ ఎన్నిక కోసం మద్దతు ఇవ్వాలంటూ నితీశ్.. జగన్ ను కోరారట. దీంతో పార్టీలో చర్చించి.. తమ నిర్ణయం చెబుతామని జగన్.. నితీశ్ కు చెప్పారట.
సో.. అలా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీకి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉండాల్సిందే. అందుకే బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వంపై కాస్త సాఫ్ట్ కార్నర్ లోనే ఉన్నది. ఇక.. జగన్ ఎలాగూ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వరు. అంటే.. ఇక మిగిలింది ఎన్డీఏ అభ్యర్థి. ఎలాగైనా వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.