‎Bigg Boss: ఆగిపోయిన బిగ్ బాస్ షో.. రంగంలోకి డిప్యూటీ సీఎం.. చివరికి అలా!

Bigg Boss: గత కొద్దిరోజులుగా కన్నడ బిగ్ బాస్ షో పేరు సోషల్ మీడియాలో మారుమొగుతున్న విషయం తెలిసిందే. కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ కోలీవుడ్ స్టూడియోను సీజ్ చేశారు అధికారులు. కార్యక్రమం జరుగుతున్న బిడదిలోని అమ్యూజ్ మెంట్ పార్క్ జూలీవుడ్ స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల శుద్ది చేయని నీరు బయటకు వస్తుందని ఆరోపణలు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులను చూసిన కూడా షో నిర్వాహకులు పట్టించుకోలేదు.

‎దీంతో తహసీల్దారు తేజస్విని అధికారులతో కలిసి బయట నుంచి తాళాలు వేశారు. దీంతో బిగ్ బాస్ షో షూటింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత 17 మంది పోటీదారులను ఈగిల్టన్ రిసార్ట్‌ లో ఉంచారు. అయితే ఈ వివాదంలో కిచ్చా సుదీప్ జోక్యం చేసుకోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. అలాగే స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగుళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. జిల్లా మేజిస్ట్రేట్ జోలీవుడ్ స్టూడియోస్ కు కాలుష్య సంబంధిత ఉల్లంఘనలను సరిదిద్దడానికి 10 రోజుల సమయం ఇచ్చారు.

‎ జోలీవుడ్ స్టూడియోస్ లాక్ డౌన్ కు బిగ్ బాస్ షోతో ఎటువంటి సంబంధం లేదని కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత బిగ్ బాస్ షో నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ యశ్వంత్ వి. గురుకర్ నేతృత్వంలో జోలీవుడ్ స్టూడియో సి గేట్ ఓపెన్ చేసారు. ఈ సమయంలో, డిప్యూటీ కమిషనర్ వెంట బెంగళూరు సౌత్ ఎస్పీ శ్రీనివాస్ గౌడ కూడా ఉన్నారు. అయితే ఈ స్టూడియోలో ఇప్పుడు కేవలం బిగ్ బాస్ షో మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉంది. మరే ఇతర కార్యకలాపాలకు అనుమతి లేదు. 17 మంది పోటీదారులను తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రిసార్ట్ నుండి బిగ్ బాస్ ఇంటికి తీసుకువచ్చారు. ఈ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.