రఘురామకృష్ణం రాజు.. ఈ పేరే కదా ప్రస్తుతం సంచలనం. ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా తారుమారయ్యాయంటే దానికి కారణం ఈ పేరే. సొంత పార్టీపైనా… సీఎం జగన్ పైనా.. ఇష్టమున్నట్టు విమర్శలు చేస్తూ వస్తున్నాడు ఈయన. పార్టీలో రెబల్ ఎంపీ అయ్యాడు. అయితే.. ఇప్పటికే ఆయనకు పార్టీ హైకమాండ్ నుంచి ఎన్నో నోటీసులు వెళ్లినా.. ఆయన తీరు మార్చుకోకపోవడం.. వైసీపీ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండటంతో.. పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకుంటోంది.
దానిలో భాగంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించి… ఆయన స్థానంలో వైసీపీ మరో ఎంపీ బాలశౌరిని నియమించారు. దీనికి సంబంధించిన ప్రకటనను లోక్ సభ సచివాలయం తాజాగా విడుదల చేసింది.
ఇప్పటికే… రఘురామకృష్ణం రాజు వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ పార్లమెంటరీ బృందం లోక్ సభ స్పీకర్ ను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. దానిపై స్పీకర్ అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
కానీ.. బ్యాంక్ రుణ ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.