పవన్ కళ్యాణ్ శ్రమదానానికి అధికారుల బ్రేకులు.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ నెల రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు చోట్ల రోడ్లపై శ్రమదానం చేసేందుకు వీలుగా జనసేన పార్టీ ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం కళ్ళ తెరిపించేందుకే ఈ ప్రయత్నమన్నది జనసేన పార్టీ వాదన. మరోపక్క, ప్రభుత్వ వాదన ఇంకోలా వుంది.. రోడ్ల మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించామనీ, పనులు త్వరలో ప్రారంభమవుతాయనీ అంటోంది ప్రభుత్వం.

కానీ, రెండున్నరేళ్ళుగా రోడ్ల పరిస్థితి మెరుగుపడ్డంలేదు. అనంతపురం జిల్లా కొత్తచెరువు రోడ్డు అలాగే తూర్పు – పశ్చిమగోదావరి జిల్లాల్ని కలిపే కాటన్ బ్యారేజీ రోడ్డుపై పవన్ కళ్యాణ్ వేర్వేరు సమయాల్లో శ్రమదానం చేస్తారట. అయితే, కొత్తచెరువు రోడ్డు మరమ్మత్తులు ప్రారంభమయ్యాయి.. ప్రభుత్వం కాస్త ముందే మేలుకుని, జనసేన అధినేతకు ఛాన్స్ ఇవ్వకూడదనే కోణంలో.. వీలైనంత వేగంగా పనులు పూర్తి చెయ్యాలనుకుంటోంది.

కానీ, కాటన్ బ్యారేజీ.. అదేనండీ ధవళేశ్వరం బ్యారేజీ పరిస్థితి వేరు. అది రోడ్లు భవనాల శాఖకు సంబంధించినది కాదు.. దాంతో, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన నిర్వహణ అంశాల పరంగా చూస్తే, ప్రభుత్వం ఇప్పటికిప్పుడు మరమ్మత్తులు చేయలేని పరిస్థితి. కాగా, ప్రాజెక్టుకి సంబంధించి సాంకేతికపరమైన అంశాల్ని అధ్యయనం చేయకుండా మరమ్మత్తులు చేయడం సాధ్యపడదనీ, శ్రమదానం పేరుతో అడ్డగోలుగా పనులు చేస్తే, ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.

ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు..’ అన్న చందాన తయారైంది పరిస్థితి.. అన్న విమర్శ అధికారుల మీదా, ప్రభుత్వమ్మీద ఆ బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తున్న ప్రజల నుంచి వినిపిస్తోంది. బ్యారేజీకి సంబంధించిన రోడ్డు పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. నిజానికి, ప్రమాదకరంగా కూడా వుంది. కంకర తేలిపోయి.. బ్రిడ్జికి సంబంధించిన ఇనుప రాడ్లు తేలిపోయి కనిపిస్తున్నాయి. ఇది బ్రిడ్జి మనుగడకే ప్రమాదకరమైన అంశం. మరి, ఈ వ్యవహారంపై జనసేన ఎలాంటి వ్యూహాలతో ముందడుగు వేస్తుంది.? ప్రభుత్వం ఒకవేళ అడ్డుపడితే, తదనంతర పరిణామాలు ఎలా వుంటాయి.? వేచి చూడాల్సిందే.