Big Releases : హమ్మయ్యా.. కోవిడ్ కల్లోలం తగ్గుతోంది దేశంలో. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో తగ్గుదలతో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే వున్న ఆంక్షల్ని క్రమంగా సడలిస్తూ వస్తున్నారు. దాంతో, సినిమా థియేటర్లలో మళ్ళీ కళాకాంతులు కనిపిస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
కోవిడ్ కారణంగా సంక్రాంతి సినిమాలు విడుదల కాలేకపోయాయి. ఇప్పుడు ఆ సినిమాలన్నీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వేసవి లోపే పెద్ద సినిమాలన్నీ విడుదలైపోతాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం విదితమే.
పెద్ద సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ముందుగా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ‘భీమ్లానాయక్’, ‘ఆచార్య’ తదితర సినిమాలుంటాయి. ‘సర్కారువారి పాట’ సంగతి సరే సరి. వీటితోపాటు, డజనుకు పైగా పెద్ద – ఓ మోస్తరు అనదగ్గ సినిమాలున్నాయి. ఓ మోస్తరు – చిన్న సినిమాలైతే పదుల సంఖ్యలోనే వుంటాయ్.
ఒక్కో సినిమాకీ కనీసపాటి గ్యాప్ లేకపోతే, ఆయా సినిమాలు నష్టపోవడం ఖాయం. అందుకే, పెద్ద సినిమాలకి కనీసం పదిహేను రోజుల గ్యాప్ వుండాలి. ఈలోగా చిన్న సినిమాలు వస్తాయా.? లేదంటే, వాటినీ ఆపుతారా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రెండు డేట్లు ఖరారు చేసుకుంది. ‘రాధేశ్యామ్’ ఇంకా ప్రకటించాల్సి వుంది. ‘భీమ్లానాయక్’ ఫిబ్రవరి నెలాఖరుకు ఖాయమైన సంగతి తెలిసిందే. కానీ, ఈ విడుదలల విషయమై సినీ వర్గాల్లో చాలా గందరగోళం కనిపిస్తోంది.