TRS and BJP : దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోందని కేంద్రమే చెబుతోంది. మరి, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి బాధ్యత వుండక్కర్లేదా.? ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ నడిబొడ్డున ‘షో’ చేయడమేంటి.? ఈ ప్రశ్న తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి దూసుకొస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంపై పోరాటమంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన బాటపడితే, ఆయన దీక్షను తెలంగాణ సర్కారు భగ్నం చేసింది. బండి సంజయ్‌ని అరెస్టు చేసి జైలుకు పంపింది. దాంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. హైద్రాబాద్‌లో ల్యాండ్ అయ్యారు.
కోవిడ్ ఆంక్షలున్నాయని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తే, ‘నిబంధనల మేరకే నడచుకుంటా..’ అంటూ జేపీ నడ్డా హంగామా సృష్టించారు. కానీ, బీజేపీ కార్యకర్తలు ఆగుతారా.? పెద్దయెత్తున గుమికూడారు. అసలే తెలంగాణలో.. అందునా హైద్రాబాద్‌లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయ్. ఈ సమయంలో ఈ ‘షో’ జేపీ నడ్డా చేయడం అవసరమా.?
ఇదంతా చూస్తోంటే, కోవిడ్ వ్యాప్తి కోసం బీజేపీ కంకణం కట్టుకుందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే, టీఆర్ఎస్ చేసే రాజకీయ కార్యక్రమాలకు లేని అడ్డంకులు బీజేపీకి ఎందుకు.? అన్నది కమలనాథుల ప్రశ్న. ఇక్కడ ప్రశ్నలకు సమయం లేదు.. ఎందుకంటే, కరోనా అత్యంత వేగంగా దేశాన్ని చుట్టేస్తోంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వుండాల్సిందే.
గులాబీ పార్టీ బాధ్యతగా వ్యవహరించాలి.. అది రాష్ట్రంలో అధికారంలో వుంది గనుక. కమలనాథులూ బాధ్యతగా వుండాలి.. ఎందుకంటే కమలం పార్టీ దేశంలో అధికారంలో వుంది గనుక. కానీ, ఇద్దరూ కలిసి పొలిటికల్ డ్రామా ఆడుతూ, కరోనా వ్యాప్తికి కారణమైతే ఎలా.?