ఏపీ సీఎం జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ పాలనాపరంగా దూసుకుపోతున్నప్పటికి క్షేత్ర స్థాయిలో మాత్రం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు నీరుగారిపోతున్నాయనే చెప్పాలి. జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన తప్పనిసరి అనేది కూడా ఒకటి.
అప్పట్లో దీనిపై జగన్ సర్కార్‌పై ప్రశంసలు అందాయి, విమర్శలు ఎదురయ్యాయి. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని మొదటి నుంచి కొందరు పట్టుపడుతుంటే, మరికొందరు మాత్రం పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యా బోధన అందేలా జగన్ తీసుకున్న నిర్ణయం గర్వకారణమని అన్నారు. ఇక దీనికి సంబంధించిన చాలా కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉండగా, సుప్రీం కోర్టు కూడా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తీర్పును ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం జగన్ సర్కార్‌కు షాక్ ఇచ్చే విధంగా ఉందనే అంటున్నారు పలువురు విశ్లేషకులు.
గత 34 ఏళ్లుగా అమలులో ఉన్న విద్యా విధానంలో భారీగా మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానానికి నాంది పలికింది. కొత్త జాతీయ విద్యా విధానం మేరకు విద్యార్థులకు ఐదో తరగతి వరకు అవసరమైతే ఎనిమిదవ తరగతి వరకు కూడా మాతృ భాషలోనే బోధన సాగించాలని కేంద్రం తీసుకొచ్చిన మార్పులలో ఈ అంశాన్ని కూడా క్లుప్తంగా పొందుపరిచింది. దీంతో ఖచ్చితంగా ఏపీలో కూడా మాతృభాషలోనే ఐదవ తరగతి వరకు బోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో జగన్ అనుకున్న ఇంగ్లీష్ బోధన ఆలోచనకు గండీ పడేట్టట్టు కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి స్థానిక భాష, మాతృభాషలోనే విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా? లేక పట్టువిడుపులకుపోయి కేంద్ర నిర్ణయానికి ఎదురీదాలని ప్రయత్నిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇలాంటివి చూస్తుంటే జగన్ అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అనే ఫార్ములా నిజమేనేమోనని అనిపిస్తుంది.