ఉధృతంగా భారత్ బంద్: ఉపయోగమేంటి పాపం.!

Bharat Band: Running Successfully, But

Bharat Band: Running Successfully, But

మరోసారి భారత్ బంద్.. ఈసారీ ఉధృతంగానే బంద్ కనిపిస్తోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు బంద్‌కి మద్దతివ్వడంతో బంద్ ప్రశాంతంగా, ఉధృతంగా కొనసాగుతోంది. అధికారంలో వున్న పార్టీలూ, కొన్ని ప్రభుత్వాలు కూడా ఈ భారత్ బంద్‌కి మద్దతిస్తుండడం మరో ఆసక్తికరమైన అంశం. నరేంద్ర మోడీ సర్కార్, ఇటీవల తెచ్చిన కొత్త సాగు చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు గడచిన నాలుగు నెలలుగా ఉద్యమిస్తున్న విషయం విదితమే. ‘మాకొద్దు మొర్రో.. ఈ చట్టాలు..’ అని రైతులు మొత్తుకుంటున్నా, ‘రైతుల్ని ఉద్ధరించడం కోసమే..’ అంటూ నరేంద్ర మోడీ సర్కార్, బలవంతంగా రైతుల నెత్తిన ఈ చట్టాల్ని రుద్దే ప్రయత్నం చేస్తోన్న విషయం విదితమే. ఈ రైతు ఉద్యమంలో ఇప్పటికే పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు, ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేస్తే, ఆ ఉద్యమంలోకి అసాంఘీక శక్తులు చొరబడి.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించాయి. పొరుగు దేశాల కుట్రలూ ఇందులో భాగమయ్యాయి.

రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే, పార్లమెంటు సాక్షిగా రైతు చట్టాలకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలు కూడా, ఇప్పుడు ఆ చట్టాలు వద్దని నినదిస్తుండడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఉదయం నుంచీ రోడ్ల మీదకు బస్సలు రాలేదు. స్వచ్చందంగా చాలా చోట్ల దుకాణాలు మూతపడ్డాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అలాగే రైతులు, సామాన్యులు కూడా రోడ్డెక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అయితే, ఉద్యమం ‘స్పాన్సర్డ్’ అని అంటున్నారు బీజేపీ నేతలు. రైతుల బాగు కోసమే తమ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నది బీజేపీ నేతల వాదన. ‘పార్లమెంటులో మద్దతిచ్చిన కొన్ని పార్టీలు, రైతుల వద్ద మొసలి కన్నీళ్ళు కార్చుతున్నాయి..’ అని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.