Bangarraju : బరిలో బంగార్రాజు.. రిస్క్ అవసరమా.?

Bangarraju :  నాగచైతన్య గత ఏడాది హిట్టు కొట్టేశాడు.. అఖిల్ కూడా హిట్టు కొట్టేశాడు.. సో, అదే ఊపులో ‘బంగార్రాజు’ సినిమాతో నాగార్జున కూడా బంపర్ హిట్టు కొట్టేద్దామనుకుంటున్నాడు. ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే.

అసలు సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు పూర్తయ్యింది.? అన్న విషయమ్మీదే చాలామందికి చాలా అనుమానాలున్నాయి. అంత ప్లాన్డ్‌గా షూటింగ్ ‘ఫినిష్’ చేసేశారు. ‘బంగార్రాజు’ని బరిలోకి దింపేశారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం ‘బంగార్రాజు’కి కలిసొచ్చినట్లే కనిపిస్తోంది.

కానీ, ఒమిక్రాన్ భయం నుంచి ‘బంగార్రాజు’కి మినహాయింపేమీ లేదు. రోజు రోజుకీ తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో సినిమా థియటేర్ల మీద ఆ ఇంపాక్ట్ గట్టిగానే పడింది. కేసుల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పెరిగితే, దెబ్బ పడేది సినిమా థియేటర్ల మీదనే.

అన్నట్టు, ‘బంగర్రాజు’ మీద ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే వున్నాయి. సినిమాని టేబుల్ ప్రాఫిట్స్‌కి అమ్మేశారనే ప్రచారమూ జరుగుతోంది. అలాంటప్పుడు, ‘బంగార్రాజు’ సంక్రాంతికి ఎందుకు రిస్క్ చేస్తున్నట్టు.? అన్నీ సజావుగా జరిగితే సరే సరి.. సినిమా రిలీజయ్యాక.. తేడా కొడితేనో.?

ఆల్ ఈజ్ వెల్.. అనుకుని బంగార్రాజు రంగంలోకి దూకేశాడు. వాసివాడి తస్సదియ్యా.. అనిపిస్తాడా.? వేచి చూడాల్సిందే.