కేసీయార్‌ని జైలుకు పంపిస్తాం: బండి సంజయ్ మళ్ళీ అదే పాత పాట.!

bandi sanjay

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని జైలుకి పంపించి తీరతామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడిందే పాటరా.. అన్న చందాన, బండి సంజయ్, ‘కేసీయార్‌ని జైలుకు పంపిస్తాం..’ అనే మాటా గత కొన్నేళ్ళుగా చెబుతూనే వున్నారు.

మొన్నటికి మొన్న గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో, ‘త్వరలో, అతి త్వరలో కేసీయార్ జైలుకు వెళ్ళడం ఖాయం..’ అని బండి సంజయ్ జోస్యం చెప్పారు. సీబీఐ ఆయన్ని పిలుస్తుందన్నారు. తాజాగా, ఈడీని కేసీయార్ మీదకు పంపిస్తామన్నట్లుగా బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

‘కేసీయార్ మీదకు కూడా ఈడీ, సీబీఐ వెళతాయ్.. ఆయన అరెస్టవుతారు, జైలుకు వెళతారు.. రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో అవినీతి జరుగుతోంది..’ అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘అరెస్టు చేయిస్తావా.? చెయ్ నీకు దమ్ముంటే..’ అంటూ ఇప్పటికే కేసీయార్, బండి సంజయ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న సంగతి తెలిసిందే.

అరెస్టులు, బెదిరింపులు.. ఇదేనా రాజకీయం.? ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడానికేనా కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నది.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి అడ్వాంటేజ్ పెరుగుతున్న సమయంలో, దాన్ని నాశనం చేసుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యలు వుంటున్నాయ్.

కాంగ్రెస్, టీఆర్ఎస్.. రెండూ ఒక్కటేనని, రెండు పార్టీలనూ తెలంగాణ నుంచి బీజేపీ తరిమికొడుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.