బండి సంజయ్ ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో మారుమోగిపోతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అద్యక్షడిగా బండి సంజయ్ భాద్యతలు తీసుకున్న తర్వాత పలు కీలక మార్పులు చేసి , రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలబెట్టడం సక్సెస్ అయ్యారు. దుబ్బాక లో విజయం సాధించి , అధికార తెరాస కి హెచ్చరికలు పంపారు. ఇక జీహెచ్ ఎం సి ఎన్నికల్లో కూడా అనూహ్యంగా భారీ సీట్లు కొల్లగొట్టారు. ఇదే జోష్ లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు.
ఇదిలా ఉంటే .. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్‌లో, కార్పొరేటర్లు కార్పొరేషన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి ఆలయాన్ని ఆయన సందర్శించారు. గుడిలో పూజల అనంతరం అక్కడే కొత్త కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వార్డు సమస్యలను పరిష్కరిస్తామని, జాతీయవాదానికి, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని.. వారితో ప్రమాణ పత్రాన్ని చదివించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఎక్కువ సీట్లు సాధించినందున భాగ్యలక్ష్మీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు బండి సంజయ్. ఆయన వెంట గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ రాజకీయాలు భాగ్యలక్ష్మీ ఆలయం చుట్టే తిరిగాయి. వరద సాయం నిలిపివేతకు బీజేపీయే కారణమని టీఆర్ఎస్ ఆరోపించడంతో.. బండి సంజయ్ భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లారు. ఎన్నికల సంఘానికి తాను ఎలాంటి లేఖ రాయలేదని.. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా.. మొదట భాగ్యలక్ష్మీ అమ్మవారికి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు