బాలయ్యబాబూ.. అది మర్చిపోతే ఎలాగయ్యా.?

సోదరి కంటతడి పెట్టడంతో.. నందమూరి బాలకృష్ణ గుస్సా అయ్యారు. బావ చంద్రబాబు ఆవేదనను అర్థం చేసుకున్న బాలయ్య, మీడియా ముందుకొచ్చి.. అధికార వైసీపీ మీద విరుచుకుపడిపోయారు. ‘అసెంబ్లీనా.? గొడ్ల చావిడా.?’ అంటూ మండిపడ్డారు నందమూరి బాలకృష్ణ.

‘మేమెప్పుడూ వైఎస్ జగన్ కుటుంబంలోని మహిళల్ని కించపర్చేలా మాట్లాడలేదు, మాట్లాడించలేదు..’ అంటూ నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. కానీ, వైఎస్ షర్మిలకి ఓ సినీ నటుడితో లింకులు అంటగట్టి సోషల్ మీడియా వేదికగా ద‌ుష్ప్రచారం చేయించిందెవరో బాలయ్యకు తెలియదా.?

అంతేనా, ఓ సినిమా కార్యక్రమంలో ఉత్సాహంగా మాట్లాడుతూ, ‘అమ్మాయి కనపడితే కడుపు చేసెయ్యాలి..’ అంటూ జుగుప్సాకరంగా సినిమాటిక్ డైలాగు పేల్చిన బాలయ్య, ఇప్పుడిలా నీతులు వల్లిస్తోంటే, నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదు.

నారా భువనేశ్వరి మీద వైసీపీ నేతలు దూషణలకు దిగడాన్ని ఎవరూ సమర్థించరు.. సమర్థించకూడదు కూడా. కానీ, వైఎస్ జగన్ సతీమణి భారతి పైనా, వైఎస్ జగన్ తల్లి విజయమ్మపైనా, వైఎస్ జగన్ సోదరి షర్మిలపైనా టీడీపీ నేతలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడూ బాలయ్య ఇదే విధంగా స్పందించి వుండాల్సింది.

రాజకీయాల్లో విమర్శలు సహజమేగానీ, ఇంత తీవ్రస్థాయి దూషణలు ఎవరికీ మంచివి కావు. అది నాయకత్వ లక్షణం అనిపించుకోదు కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఈ మొత్తం వివాదంపై స్పందించాలి.. పార్టీ నేతల్ని అదుపు చేయాలి.

అదే సమయంలో, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా పార్టీ శ్రేణుల్ని హెచ్చరించాలి, ఇంకెవరూ రాజకీయాల్లో మహిళల పట్ల కించపర్చేలా వ్యవహరించకూడదని ఆదేశించాలి. మహిళలనే కాదు, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటమనేది అన్ని రాజకీయ పార్టీలూ మానేసిన రోజే.. రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది.