Balayya Gets Trolled : అయ్యయ్యో బాలయ్యా.. ఈ పంచాయితీ నీకెందుకయ్యా.? అంటూ బాలయ్య అభిమానులు వాపోతున్నారు. ‘బాలయ్య మానసిక రోగి.. ఇదిగో సర్టిఫికెట్..’ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న వైనాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు మరి.
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అయినప్పటికీ, నందమూరి బాలకృష్ణ పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించరు. కొత్త జిల్లాల వ్యవహారానికి సంబంధించి, బాలయ్య రంగంలోకి దిగడం వెనుక, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహం సుస్పష్టం.
బాలయ్య రాకతో, టీడీపీకి కొత్త ఉత్సాహం వస్తుందని చంద్రబాబు నమ్మి వుండొచ్చుగాక. కానీ, బాలయ్య రంగంలోకి దిగి చేస్తున్న కామెంట్లతో ఒక్కసారిగా టీడీపీ మరింత పతనానికి దిగజారిపోతోంది. జిల్లాల విభజన వ్యవహారంపైనా, ఇతర వ్యవహారాలపైనా బాలయ్య చేస్తున్న వ్యాఖ్యలు నవ్వు తెప్పించేస్తున్నాయి మరి.
దీనికి తోడు, అప్పుడెప్పుడో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన, ఆ తర్వాత బాలయ్య తన మానసిక స్థితి పరిగ్గా లేదని సర్టిఫికెట్ తెచ్చుకోవడం.. ఆనాటి అంశాలన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. రాజకీయాల్లో అన్నీ వుంటాయ్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి వ్యవహారాన్ని టీడీపీ తెరపైకి తెస్తున్నప్పుడు.. బాలయ్య గతాన్ని వైసీపీ శ్రేణులు తవ్వకుండా వుంటాయా.?
చంద్రబాబు ఏమన్నా కుప్పం జిల్లా కోసం డిమాండ్ చేశారా.? నారా లోకేష్ ఏమైనా మంగళగిరి జిల్లా కావాలంటున్నారా.? వాళ్ళెవరికీ లేని పంచాయితీ బాలయ్యకే ఎందుకు.? ఫాఫం బాలయ్య.. టీడీపీ ఆడిన ఆటలో పావుగా మారి, రాజకీయంగా బలైపోతున్నారు.