తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఈ విధంగా బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే అందులో నరసింహనాయుడు ఒకటిగా చెప్పుకోవాలి. బాలకృష్ణ సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా 2001లో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనంగా మారింది.
డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నాలుగో సినిమా నరసింహ నాయుడు. అప్పట్లోనే ఈ సినిమా సంక్రాంతికి విడుదలయి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో మొదటిసారిగా 105 కేంద్రాలలో 100 రోజులు ఆడిన సినిమాగా నరసింహనాయుడు సినిమా నిలబడింది. అప్పట్లోనే ఈ సినిమా ఏకంగా 30 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సంచలనంగా మారిందని చెప్పాలి.
2001 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మృగరాజు, దేవి పుత్రుడు సినిమాకు గట్టిపోటీ ఇస్తూ ఈ మూడు సినిమాలలో బాలక్రిష్ణ నరసింహనాయుడు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సృష్టించగా, మృగ రాజు డిజాస్టర్ గా మిగిలిపోయింది. దేవి పుత్రుడు మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ సినిమాకు బాలయ్య నటన హైలెట్ కావడమే కాకుండా మణిశర్మ సంగీతం, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి. తర్వాత బాలకృష్ణ సమరసింహా రెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు కూడా ఇదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేశాయి.