నందమూరి బాలకృష్ణ కొత్తగా కనిపిస్తున్నారు. ఇదివరకు ఎన్నడూ సోషల్ మీడియా ప్రచారాల వైపు మొగ్గుచూపని ఆయన ఈసారి మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన అప్ కమింగ్ సినిమాల మీద సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయా చిత్ర బృందాలే ఈ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆయనతో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలు బర్త్ డే స్పెషల్ పోస్టర్లు వదిలారు. నిన్నటి నుండే వీటికి సంబంధించిన హడావుడి మొదలైంది. అభిమానులు పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. ముందుగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’ పోస్టర్ విడుదలైంది.
పోస్టర్లో బాలకృష్ణ క్లాసీ లుక్ ఆకట్టుకుంది. దీనికంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఎగ్జైట్ అయింది మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మీదనే. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకుడు. నిన్న మైత్రీ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రాయల్టీ మీట్స్ ఫిరోసిటీ అంటూ ప్రీలుక్ పోస్టర్ వదిలారు. దాన్ని చూసి అనౌన్స్మెంట్ పోస్టర్ వేరే లెవల్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కాసేపటికే సింహం బొమ్మతో ఉన్న పోస్టర్ ఒకటి మైత్రీ లోగోతో విడుదలైంది. అందులో బాలకృష్ణ లేకపోవడంతో అదేదో ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనుకున్నారు అందరూ. తీరా ఈరోజు చూస్తే అదే పోస్టర్ మైత్రీ సంస్థ నుండి విడుదలైంది.
దీన్నిబట్టి దాచిపెట్టిన పోస్టర్ లీక్ కాబడిందని అర్థమవుతోంది. అంతేకాదు పోస్టర్లో సింహం కాకుండా సింహం లాంటి బాలయ్య ఉండి ఉంటే ఇంకా బాగుండేదని అంటున్నారు ఫ్యాన్స్.