తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకి ‘టీడీపీ చీఫ్’ పదవిపై మోజు కలిగిందా.? పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా వున్నానంటూ బాలయ్య పంపిన సంకేతాల సారాంశమేంటి.? అన్నదానిపై తెలుగుదేశం పార్టీలోనే తీవ్రాతి తీవ్రమైన చర్చ జరుగుతోంది.
పార్టీ పగ్గాల మీద ఆశలేదనే క్లారిటీ బాలయ్య ఇచ్చాకనే, ఆయనకు ఎమ్మెల్యే సీటుని చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చారన్నది ప్రముఖంగా వినిపించే మాట. పార్టీ పగ్గాల సంగతి తర్వాత.. అసలంటూ పార్టీ వ్యవహారాల్లోనే బాలయ్య జోక్యం చేసుకోవడంలేదు.. జోక్యం చేసుకునేందుకు చంద్రబాబు కూడా అవకాశమివ్వట్లేదు.
పార్టీ వ్యవహారాలన్నీ చంద్రబాబు, నారా లోకేష్ మాత్రమే చూసుకుంటున్నారు. చంద్రబాబు స్వయానా బాలయ్యకు ‘బావ’. నారా లోకేష్ అయితే, బాలయ్యకు స్వయానా మేనల్లుడు అలాగే అల్లుడు కూడా. సో, పార్టీ వ్యవహారాలు బాలయ్య చూసుకున్నా, చూసుకోకపోయినా ఒకటేనన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మాట. కానీ, స్వర్గీయ నందమూరి తారకరామారావు నట వారసత్వమేనా.? రాజకీయ వారసత్వం ఏమైనా వుందా.? అన్న ప్రశ్న ప్రతిసారీ ఉత్పన్నమవుతోంది.
స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని చంద్రబాబు లాక్కున్నారు.. ఎన్టీయార్ అనే మహాశక్తిని నిర్వీర్యం చేసి పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుని బయటకు పంపి, బాలయ్య పార్టీ పగ్గాలు చేపడితే అది తప్పెలా అవుతుందన్నది బాలయ్యబాబు వీరాభిమానుల వాదన. యంగ్ టైగర్ ఎన్టీయార్, రాజకీయాల్లోకి వచ్చేస్తాడేమోనన్న భయంతోనే బాలయ్య, టీడీపీ పగ్గాలు తాను చేపట్టడానికి సిద్ధంగా వున్నానని చెప్పారే తప్ప, ఆయనకు అంత సీన్ లేదని తెలుగు తమ్ముళ్ళే ‘ఆఫ్ ది రికార్డు’గా చెప్పుకుంటున్నారట.