హీరోలు నిర్మాతలుగా, దర్శకులుగా మారడం మన దగ్గర మామూలే. చాలా మంది సీనియర్ హీరోలకు డైరెక్షన్ చేయాలనే తపన ఉంటుంది. అలాగని అందరు హీరోలు దర్శకులుగా సక్సెస్ అవుతారని కూడ లేదు. మన తెలుగులో అయితే ఎన్టీఆర్, కృష్ణ మినహా మెగా ఫోన్ పట్టిన మిగతా పెద్ద హీరోలు ఎవ్వరూ సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడ యాక్షన్, కట్ చెప్పడానికి రెడీ అయ్యారు. నిజానికి బాలకృష్ణ దర్శకత్వ ప్రయత్నాలు ఇప్పటివి కావు. నర్తనశాల సినిమాతోనే ఆయన డైరెక్టర్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ సినిమా ఆగిపోయింది. దీంతో ఆయన కలలకు బ్రేకులు పడ్డాయి.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన్ను డైరెక్షన్ వైపు మొగ్గుచూపేలా చేసిన సినిమా ఆదిత్య 999. బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు చేసిన ఆదిత్య 369కు ఇది సీక్వెల్. ఈ సినిమాతోనే బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే కథ రెడీగా ఉంది. అయితే మొదట దీనికి కూడ దర్శకత్వం సింగీతమే అనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అది కుదిరేలా లేదు. అందుకే ఆ బాధ్యతను బాలకృష్ణే మీద వేసుకున్నారు. పైగా కుమారుడి లాంచ్ కూడ తన చేతుల మీదనే జరగడం కూడ కలిసి వస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే 2023లోనే అంటున్నారు. ఈలోపు మోక్షజ్ఞ ప్రిపరేషన్స్ జరుగుతాయట. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇందులో బాలకృష్ణ కూడ ఒక కీ రోల్ చేయబోతున్నారు.