ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ రెడ్డి.. ఇలా ఎవర్నీ వదలడంలేదు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. కథ మళ్ళీ మొదటికొచ్చింది. అడ్డగోలు విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఇలా నోరు జారినందుకే, రఘురామపై రాజద్రోహం కేసు నమోదయ్యింది. ఈసారి ఇంకెలాంటి సత్కారాన్ని ఆయన ఆశిస్తున్నారోగానీ, బెయిల్ బ్యాచ్.. అంటూ జగన్, విజయసాయిరెడ్డి, సునీల్ కుమార్‌లపై విరుచుకుపడిపోయారు రఘురామ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద వున్నారని తెలిసే కదా, రఘురామ.. వైసీపీలో చేరింది.
అప్పుడు గుర్తుకురాని బెయిల్ బ్యాచ్, ఇప్పుడెందుకు రఘురామకి గుర్తుకొచ్చింది. ఇక్కడ రఘురామ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, రఘురామకృష్ణరాజు కూడా బెయిల్ మీదనే వున్నారు. రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామ, సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందిన విషయం విదితమే. సుప్రీంకోర్టు విధించిన షరతుల్లో, మీడియా ముఖంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దనీ, సోషల్ మీడియా వేదికగా కూడా ఎలాంటి వీడియోలూ విడుదల చేయొద్దనీ సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. సరే, రాజకీయ నాయకులు నోటికి ప్లాస్టర్ అంటించుకుని వుండడం.. అదేనండీ, అస్సలు మాట్లాడకుండా వుండడం అనేది సాధ్యమయ్యే పనే కాదనుకోండి.. అది వేరే విషయం. రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. కానీ, మరీ ఇంత దారుణంగానా.? ఎవరి మెప్పుకోసం ఇదంతా రఘురామ చేస్తున్నారు.? ఏమో, అది ఆయన విజ్ఞతకే తెలియాలి. బెయిల్ బ్యాచ్ మీద ఆరోపణలు చేస్తూ, ఆ బెయిల్ బ్యాచ్ పార్టీలోనే వుండటమెందుకు.? రఘురామ, వైసీపీకి.. వైసీపీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికీ రాజీనామా చేసెయ్యొచ్చు కదా.?