అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇంత రచ్చ జరిగి ఉండదు. పొలిటికల్ గా ఇంత వేడీ రగులుకోదు. కానీ.. ఒకే ఒక్క స్థానం కోసం తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ తెగ కొట్టుకుంటున్నాయి. అధికార పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉండి కూడా దుబ్బాకలో గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఇది ఒక ఉప ఎన్నిక కానీ.. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. ఈ ఎన్నిక వల్ల రాజ్యాలు మారవు. ఎవ్వరికీ వచ్చేదేం లేదు. కానీ.. పరువు ముఖ్యం. ఎలాగైనా గెలవాల్సిందే అన్న కసితో అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
ఇంకో వారం రోజుల్లో ఉపఎన్నిక జరగనుంది. కానీ.. ప్రస్తుతం దుబ్బాకలో పరిస్థితులు చూస్తే మాత్రం ఖంగుతినాల్సిందే. వామ్మో.. ప్రధాన పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. ఒక పార్టీ నేతపై ఇంకో పార్టీ నేత దుమ్మెత్తిపోయడం. నువ్వేం చేశావు.. అంటే నువ్వేం చేశావు అంటూ ఒకరిని మరొకరు తిట్టుకోవడం.. వామ్మో.. వాట్ నాట్.. రాజకీయాలంటే ఇలా ఉంటాయా అని తెలంగాణ ప్రజలు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు.
గెలిచాక ఎవ్వరూ తమ వంక కూడా చూడలేదని.. కానీ ఎన్నికలు అనేసరికి మాత్రం పార్టీలన్నీ ఇక్కడే పాగా వేశాయని.. వామ్మో.. ఈ రాజకీయ పార్టీలను నమ్మొదంటూ దుబ్బాక ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
అయితే సోమవారం సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులు సోదా చేయగా డబ్బుల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఆ డబ్బును పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇదంతా ప్రభుత్వం చేసిన కుట్ర అని.. కావాలని బీజేపీ పార్టీని ఇరుకున పెట్టాలని కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు.
బీజేపీ కార్యకర్తలు కూడా అవి బీజేపీ నేత డబ్బులు కాదని.. పోలీసులే కావాలని డబ్బు తీసుకొచ్చారని.. పోలీసుల నుంచి ఆ డబ్బును లాక్కున్న సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో బీజేపీ నేత బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రఘునందన్ మీద కావాలని కుట్రలు పన్నుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నైతికంగా ఎప్పుడో ఓడిపోయింది. ఓటమి భయంతో ఇలాంటి కుట్రలు చేస్తున్నారా? మామా అల్లుళ్ల కుట్రలు ఇక్కడ ఏమాత్రం పనిచేయవు. ప్రధాని మోదీ ఒక్కసారి కన్నెర్ర చేస్తే చాలు.. కేసీఆర్ జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటూ బాబు మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుబ్బాకలో కనీస వసతులు ఉన్నాయా? పోనీ.. సీఎ కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నియోజకవర్గాలు గజ్వేల్, సిద్ధిపేట ఎలా ఉన్నాయి? మళ్లీ గెలిచి మీరు సాధించేదేంటి? అంటూ బాబు మోహన్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.