బాక్సింగ్ డే టెస్ట్‌: విజ‌యానికి ఏడు వికెట్ల దూరంలో భార‌త్

ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నే క‌సితో రెండో టెస్ట్‌లోకి బ‌రిలోకి దిగిన భార‌త్ ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్‌లోను స‌త్తా చాటుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి బంతి నుండి ఈ టీం బ్యాట్స్‌మెన్స్‌ను భార‌త బౌల‌ర్స్ ఇబ్బంది పెట్టారు. ఎట్ట‌కేల‌కు 195 ప‌రుగుల‌కే ఆలౌట్ చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన భార‌త్ బ్యాట్స్‌మెన్స్ ఎమ్‌సీజీలో బ్యాటింగ్‌ చేయడం ఇంత సులువా అన్న రీతిలో ఆడారు. ఓపెన‌ర్స్ మ‌రోసారి నిరాశ ప‌రచిన కెప్టెన్ అజింక్యా ర‌హానే, ర‌వీంద్ర జ‌డేజా అద్భుతంగా ఆడారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాది టీమ్‌ఇండియాను మెరుగైన స్థితికి చేర్చారు.

ఓవ‌ర్‌నైట్ స్కోరు 327/5తో ఈ రోజు ఇన్నింగ్స్ పెట్టిన భార‌త్‌కు ఆదిలోనె దెబ్బ తగిలింది. ర‌హానే 112 ప‌రుగులు చేసి ర‌నౌట్ గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత జ‌డేజా, అశ్విన్ క‌లిసి కొద్ది సేపు ఆసీస్ బౌల‌ర్స్ స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. ఈ క్ర‌మంలోనే జ‌డేజా(57) అర్ద సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ బౌలింగ్‌లో ఫుల్ షాట్ ఆడబోయి క‌మ్మిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక అశ్విన్‌(14), ఉమేష్ యాద‌వ్(9), బుమ్రా (0), సిరాజ్‌(0 నాటౌట్‌) వెంట‌వెంట‌నే ఔట్ కావ‌డంతో భార‌త్ 326 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 131 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

ఇక రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఆస్ట్రేలియాని భార‌త బౌల‌ర్స్ వ‌ణికిస్తున్నారు. మూడో రోజు టీ స‌మ‌యానికి ఆసీస్ 3 వికెట్ల‌కు 78 ప‌రుగులు చేసింది. ఇప్ప‌టికీ 53 ప‌రుగులు వెనుక‌బ‌డే ఉంది. జో బ‌ర్న్స్ (4), లాబుషేన్ (28), స్మిత్(8) ఔట‌య్యారు. మాథ్యూ వేడ్ (34), హెడ్ (6) క్రీజులో ఉన్నారు. ఒక వికెట్ తీసుకున్న ఉమేష్ యాద‌వ్ కాలి గాయంతో మైదానాన్ని వీడారు. అత‌ను తిరిగి వ‌స్తాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక భార‌త బౌల‌ర్స్‌లో అశ్విన్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు