విశ్వరూపం చూపించబోతున్న సోము వీర్రాజు

Somu Veerraju
Somu Veerraju
బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు శైలి దూకుడుగానే ఉంది.  ముఖ్యంగా పార్టీలోని వ్యక్తుల విషయంలో వీర్రాజు చాలా వేగంగా స్పందిస్తున్నారు.  అంతేకాదు ఆ స్పందన కొంచెం ఘాటుగానే ఉంటోంది.  కొన్నిరోజుల క్రితం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా మాట్లాడి నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో ఒక నాయకుడిని ఉన్నపళంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారు.  తాజాగా మహిళా నేత సాధినేని యామిని వ్యవహారంలో అయన స్పందించిన తీరు చూస్తే క్రమశిక్షణ తప్పితే దండించడమే కాదు అవసరమైనప్పుడు అండగా కూడా నిలుస్తారని అర్థమైంది. 
 
మహిళా నేత యామిని శ్రీరామ జన్మభూమిలో రాముడి ఆలయానికి జరిగిన శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం మీద తీవ్రంగా మండిపడ్డారు.  దీంతో టీటీడీ విజులెన్స్ విభాగం యామిని మీద తిరుపతి టూటౌన్ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసింది.  పోలీసులు ఆమెపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  దీన్ని సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.  శతాబ్దల కల అయోధ్య లోని రామాలయం  యొక్క శంకుస్థాపన.  ఈ కార్యక్రమం  ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రచారం చేసిన నేపధ్యంలో కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క TTD లో ప్రచారం చెయ్యక పోవడం అంటే, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం.   దీనిపై బిజెపి లో వున్న అనేక మంది ప్రస్తావించారు. యమిని గారి మీదే కేస్ పెట్టడం మంచిది కాదు.  ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అంటూ గట్టిగా మాట్లాడారు. 
 
రాష్ట్ర బీజేపీ నేతలు ఇలా వీర్రాజుగారు యామినికి సపోర్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నారు.  వీర్రాజుగారు కేవలం మాటల ద్వారా డిమాండ్ చేసి ఊరుకోరని, యామిని మీద పెట్టిన కేసులను టీటీడీ ఉపసంహరించుకునేలా చేయడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని, అవసరం అయితే కేంద్ర స్థాయి నేతల సహాయం తీసుకోవడానికి కూడా అయన సిద్దంగా ఉన్నారని అనుకుంటున్నారు.  ఇన్నాళ్లు అధికార పక్షం ఏం చేసినా, ఏం మాట్లాడినా చూసీచూడనట్టు పోయిన భారతీయ జనతా పార్టీ ఇక మీదట అలా ఉండదని, సోము వీర్రాజుగారు పాలక పక్షం విషయంలో విశ్వరూపం చూపుతారని మాట్లాడుకుంటున్నారు.