దేశంలో రోజురోజుకీ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుంది. రోడ్డు ప్రమాదాల వల్ల మాత్రమే కాకుండా ఎలా ప్రయాణం చేసినా కూడా ప్రమాదాల సంభవిస్తున్నాయి. రైళ్లు, విమానాలు కూలి ఎంతోమంది మృత్యువాత పడుతుంటే సముద్రాలలో పడవలలో ప్రయాణించే వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలో పడవ బోల్తా పడి దాదాపు 20 మంది జల సమాధి అయ్యారు. రక్షాబంధన్ సందర్భంగా తమ పుట్టింటికి బయలుదేరిన మహిళలు ఇలా అనుకోని ఘటన వల్ల మృత్యువాత పడ్డారు.
వివరాలలోకి వెళితే…బందాలోని మార్కా ఘాట్ నుండి ఫతేపూర్ వెళ్తున్న పడవ అదుపుతప్పి యమునా నదిలో మునిగిపోయింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులలో 20 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. రక్షాబంధన్ సందర్భంగా మహిళలు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీ కట్టడానికి మార్కా ఘాట్ నుండి ఫతేపూర్ బయలుదేరారు. ఏడాదికి ఒకరోజు వచ్చే రక్షాబంధన్ పండుగ రోజున తమ సోదరులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆ మహిళలందరూ బయలుదేరారు. ఈ క్రమంలో ఫతేపూర్ వెళ్తున్న పడవలో దాదాపు 40 మంది ప్యాసింజర్లు 40 మందిలో దాదాపు 25 మంది మహిళలే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
40 మందితో బయలుదేరిన పడవ బందా జిల్లాలో యమునా నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పడవలో ప్రయాణిస్తున్న మహిళలలో కొంతమంది నీట మునిగి జల సమాధి అయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడటానికి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో SDRF బృందాలు, గజ ఈతగాళ్లతో పాటు స్థానికులు కూడా ఈ ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ విచారణ వ్యక్తం చేశాడు. ప్రమాదంలో నీట మునిగిన వారిని రక్షించేందుకు అధికారులను పంపి సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.