చట్ట సభలంటే ఇంతేనా.? గెంటివేసుడు.. బాయ్‌కాట్ చేసుడు.!

మీకు తెలుసా.. చట్ట సభల్లో చట్టాలు జరుగుతాయని.! రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే చట్టాలు ఈ చట్ట సభల్లో జరుగుతుంటాయ్. మరి, ప్రజలు ఎంత బాధ్యతగా చట్ట సభల గురించి తెలుసుకోవాలి.? అందులోని కార్యకలాపాల గురించి మాట్లాడుకోవాలి.? అందుకే, చట్ట సభల్లో కార్యకలాపాల్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జనంలోకి తీసుకెళుతుంటాయి ప్రభుత్వాలు.

కానీ, ఇప్పుడు చట్ట సభల్లో జరుగుతున్నదేమిటి.? ఏ చట్ట సభ అయినా ఒకటే తంతు. రాష్ట్రాల్లో చట్ట సభలు కావొచ్చు.. దేశంలో పార్లమెంటు ఉభయ సభలు కావొచ్చు.. పెద్దగా తేడాలేం లేవు. అరుచుకోవడం, తిట్టుకోవడం.. కుదిరితే కొట్టుకోవడం.. మంది బలాన్ని ఉపయోగించుకుని, అడ్డగోలు చట్టాలు చేయడం. ఇదే నడుస్తోంది.

కొత్త సాగు చట్టాల్ని కేంద్రం ఎలా తెచ్చిందీ, ఎలా వెనక్కి తీసుకున్నదీ చూశాం. చట్ట సభలు ఎందుకు.. దండగ కాకపోతే.? అన్న చర్చ ఇలాంటి సందర్భాల్లోనే గట్టిగా జనంలో జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాష్ట్రాల బిల్లు వ్యవహారం కూడా ఇలాగే జరిగింది. కాకపోతే, కొత్త బిల్లు తెస్తామంటోంది వైసీపీ సర్కారు అదే మూడు రాజధానులకు సంబంధించి.

ఇక, తెలంగాణలోనూ అసెంబ్లీ సమావేశాలు అలాగే జరుగుతున్నాయ్. మాజీ మంత్రి, బీజేపీ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్‌ని సభ నుంచి బయటకు పంపేశారు. ఆయనేమో, బయటకెళ్ళి కేసీయార్ సర్కారు మీద దుమ్మెత్తి పోస్తున్నారు.
అన్నట్టు, ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని వైసీపీ పాలన వున్నంత వరకూ బాయ్‌కాట్ చేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ అండ్ టీమ్, అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించింది.

ఈమాత్రందానికి చట్ట సభలెందుకు.? పార్టీ సమావేశాలు సరిపోవూ.?