హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన వెంటనే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై విపక్షాలన్నీ దీటుగా కౌంటర్ ఇస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాజాగా, ఈ అంశంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఈ విషయంలో బండి సంజయ్‌కు ఒవైసీ సవాలు విసిరారు.
ఎన్నికల ప్రచారంలో ఒవైసీ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కౌంటర్ గా ‘దేశంలో ఉన్నవాళ్లంతా ఇండియన్లేనని’ అన్నారు. ‘‘బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నాం. పాతబస్తీలో పాకిస్థాన్ వాళ్లు ఎవరున్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పాలి. భారత సరిహద్దు వద్ద చైనా 970 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అక్రమించింది. దమ్ముంటే అక్కడకు వెళ్లి అమిత్‌షా సర్జికల్ స్ట్రైక్ చేయాలి. దేశం నుంచి ముస్లింలను వేరు చేయలేరు. టెర్రరిస్టులు, పాకిస్థాన్ అనే పదాలు లేకుండా ప్రచారం చేయగలరా? దమ్ముంటే చదువు, అభివృద్ధి గురించి చెప్పి ఎన్నికల్లో విజయం సాధించాలి’’ అని బీజేపీకి అసదుద్దీన్ సూచించారు.