మీది తెలంగాణా? డిగ్రీ పూర్తయిందా? డిగ్రీ పూర్తి చేసి కనీసం మూడేళ్లయినా అయిందా? అయితే మీకు త్వరలో తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే చాన్స్ ఉంది. దాని కోసం మీరు మీ ఓటును నమోదు చేసుకుంటే చాలు. ఎవరు ఎమ్మెల్సీ కావాలో డిసైడ్ చేసే అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది.
తెలంగాణలో త్వరలో రెండు గ్రాడ్యుయేట్(పట్టభద్రుల) నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాని కోసమో ఓటు నమోదు చేసుకోవాలి. అయితే.. గతంలో ఓటు నమోదు చేసుకున్నా సరే.. మళ్లీ నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం చెబుతోంది.
అంటే.. గ్రాడ్యుయేట్లు అందరూ మళ్లీ తమ ఓట్లను నమోదు చేసుకోవాలి. తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే సంవత్సరం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఆ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది.
దాని కోసం డిగ్రీ పూర్తయి ఈ సంవత్సరం నవంబర్ 1 కి మూడేళ్లు పూర్తి చేసుకున్నవాళ్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులు. అర్హత ఉన్నవాళ్లు అక్టోబర్ 1 నుంచి ఆన్ లైన్ ద్వారా కానీ.. ఆఫ్ లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 1 న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి.. వచ్చే సంవత్సరం జనవరి 18న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.
ఆన్ లైన్ లో అప్లయి చేయాలనుకునేవాళ్లు… www.ceotelangana.nic.in లేదా www.nvsp.in వెబ్ సైట్లలో ఫామ్ 18 ను నింపాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ ను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
ఒకవేళ ఆఫ్ లైన్ లో చేయాలనుకుంటే… ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రత్యేక అధికారులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. వాళ్ల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులు తీసుకొని.. వాటిని నింపి.. దరఖాస్తుకు ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ ను జతచేయాల్సి ఉంటుంది.