తెలుగు రాష్ర్టాల మధ్య చోటు చేసుకున్న జలజగడం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ర్టాల మధ్య పంచాయతీ ఎటు తేలలేదు. పోతిరెడ్డి ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని, తక్షణం ఆ ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రతిగా గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్ట్ లకు ఏపీ అడ్డు తగలింది. అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్ట్ లు చేపడుతున్నారని గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బో ర్డుకు ఫిర్యాదు చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి బోర్డు షాకిచ్చింది.
గోదావరిపై నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ లు అన్నింటినీ తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. అపెక్స్ బోర్డు అనుమతి లేకుండా ప్రాజెక్ట్ లు ఎలా? చేపడుతున్నారని ప్రశ్నించింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుబంధంగా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ లన్నింటికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయింది. ప్రస్తుతం గోదావరి నదీ జలాలను ఆధారం చేసుకుని తెలంగాణ మొత్తం 16 ప్రాజెక్ట్ లు చేపడుతోంది. ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం, దేవాదుల, కాళేశ్వరం ఎల్ ఐఎస్, లెండి, లోయర్ పెన్ గంగ, మిడ్ మానేరు డ్యామ్ లాంటి ప్రాజెక్ట్ లు అన్ని ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్లే. ముందు పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు వ్యవహారం తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సామర్ధ్యంపై తెలంగాణ ఏపీకి అడ్డు తగులుతోంది. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తామని..అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా ఆపుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. దానికి కౌంటర్ గా తమ వాటా నీళ్లు మాత్రమే తీసుకుంటున్నామని సీఎం జగన్ వివరణ ఇచ్చారు.
కృష్ణా బోర్డు ఇప్పటికే ఇరు రాష్ర్టాల అధికారులను పిలిపించి సమావేశం ఏర్పాటు కూడా చేసింది. త్వరలో అపెక్స్ బోర్డుకి ఈ పంచాయతీ చేరనుంది. జూన్ 4న ఈ విషయంపై మరోసారి కృష్ణాబోర్డు లో భేటీ జరగనుంది. అలాగే ఇరు రాష్ర్టాలముఖ్యమంత్రుల సమావేశం కూడా జరగనుందని సమాచారం. ఈలోపే తెలంగాణకి గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పనులు ఆపమని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇరు రాష్ర్టాల యంత్రాగం ఆ పనుల్లోనే బిజీగా ఉంది. ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తుండటంతో? అధికారులు ఫ్రీ అవుతున్నారు. ఇకపై జల జగడంపై రెండు రాష్ర్టాలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.