గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ జస్టిస్ ఈశ్వరయ్యకు సంబంధించిన ఆడియో టేప్స్ సంచలనం సృస్తిస్తున్నాయి. ఈయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య మండలి చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రిందట ఈశ్వరయ్య మాజీ మేజిస్ట్రేట్ అయిన రామకృష్ణతో ఫోన్ లో జరిపిన సంభాషణలో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. హై కోర్టు, సుప్రీం కోర్టు జడ్జ్ లపై కుట్రలు పన్నుతున్నట్టు ఆ ఆడియోల సారాంశం.
ఈ ఆడియో టేప్స్ పై స్పందించిన హై కోర్టు విచారణ జరపడానికి మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ రవీందర్ ను నియమించింది. ఈ విచారణలో సిబిఐ అధికారులు సహకరించాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆడియో టేప్స్ లలో ఉన్న వాయిస్ ఈశ్వరయ్యదేనా కాదా అనే అంశంపై విచారణ జరిపిన తరువాత దీనిపై హై కోర్టు ముందుకు వెళ్లనుంది. హై కోర్టు రిజిస్టార్ మరణంపై హై కోర్ట్ జడ్జ్ కరోనా నిబంధనలు పాటించకపోవడమే కారణమని సుప్రీం కోర్ట్ కొలిజియంకు కావాలనే తన అనుచరులతో లేఖ రాయించినట్టు రామకృష్ణకు ఈశ్వరయ్య ఆడియో టేప్స్ లలో తెలిపారు.
ఇదే విషయంపై తన అనుచరులతో హై కోర్ట్ లో పిటిషన్ కూడా వేయించానని టేప్స్ లలో తెలిపారు. ఇప్పుడు ఈ ఆడియో టేప్స్ ను ఆధారంగా చేసుకొని రామకృష్ణ ఈ కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని హై కోర్టుకు దరఖాస్తు చేయడంతో ఈశ్వరయ్యకు అడ్డంకి వచ్చింది. ఈ కేసులో ఇంప్లీడ్ చెయ్యాలా వద్దా అనేది ఆ టేప్స్ పై విచారణ జరిగిన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. హై కోర్ట్ ఈ కేసును విచారించడానికి మాజీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిని నియమిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది.