ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2021 నుంచి ఏపీలో సమగ్ర భూ సర్వే చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సమగ్ర భూసర్వేకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలంటూ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
జనవరి 1న ప్రారంభం అయ్యే భూసర్వే ఆగస్టు 2023 నాటికి పూర్తి కానుంది. ఏపీ సీఎం జగన్ సమగ్ర భూసర్వేపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అర్బన్ ప్రాంతాల్లోనూ భూసర్వే చేయాలని సీఎం చెప్పారు.
ఎక్కడైతే వివాదాలు ఉంటాయో.. అక్కడికి సర్వే బృందాలను పంపించి.. వెంటనే వివాదాలను పరిష్కరించాలని ఆదేశించారు. భూవివాదాల పరిష్కారం కోసం మొబైల్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
సమగ్ర భూసర్వే చేయడం కోసం కావాల్సిన అధునాతన పరికరాలన్నింటినీ ఏర్పాటు చేయాలన్నారు. డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే సర్వే కోసం ఉపయోగించే ఆధునిక మిషన్లపై సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
సమగ్ర భూసర్వే సమీక్షలో సీఎంతో పాటు మంత్రి కృష్ణదాస్, సీఎస్ సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో భూసర్వే చేయించాలని భావించింది. అయితే.. సర్వే కోసం కావాల్సిన మ్యాన్ పవర్, ఇతర సమస్యల వల్ల ఇన్ని రోజులు ఆలస్యం అయింది. సర్వే చేయడం కోసం ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటుగా… ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించి.. సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.