పాలన వికేంద్రీకరణ, సీఆర్ డీ ఏ బిల్లుల్ని శాసనమండలి తిరస్కరించడంతో ఆ రెండు బిల్లులు పెండిగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. శాసనసభలో ఆమోదం పొందినా శాసన మండలి సమ్మతింకపోవడంతో బిల్లులు ముందుకు కదల్లేదు. తాజాగా శాసనమండలి లో బిల్లుల గవుడు ఈనెల 17 తో పూర్తవ్వడంతో ఆ రెండు బిల్లులు ఏపీ గవర్నర్ భిశ్వబూషణ్ హరించందన్ ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు బిల్లుల్ని ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపించింది. దీంతో గవర్నర్ ఆమెదిస్తే బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అనంతరం జగన్ సర్కార్ లైన్ క్లియర్ అయినట్లే. మూడు రాజధానుల అంశానికి మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల బలం ఎక్కువగా ఉండటంతో అడ్డుపడిన సంగతి తెలిసిందే.
దీంతో మండలి చైర్మన్ ఆ బిల్లులను విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవే బిల్లులు ను మళ్లీ జగన్ ప్రభుత్వం రెండవసారి అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపించినా మళ్లీ తిరస్కరణకు గురయ్యాయి. అయితే ఈసారి జగన్ కొత్త వ్యూహంతో ముందుకెళ్లారు. మండలిలో బిల్లు తిరస్కరణకు గురైనా గడువు ముగిసిన తర్వాత ఆ అదే బిల్లును గవర్నర్ ఆమెదంతో చట్టం చేయవచ్చు. జగన్ ఇప్పుడు ఆదిశగానే ముందుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ఈ బిల్లుకు అడ్డు తగిలే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు.
గవర్నర్ ని కలిసి బిల్లుల విషయంపై వేర్వేరుగా లేఖలు అందించారు. మూడు రాజధానుల బిల్లు, మండలి రద్దు అంశాలు కేంద్రం పరిదిలో ఉన్నాయని గుర్తు చేసినట్లు సమాచారం. దీంతో వైకాపా నేతలు టీడీపీ పై మండిపడుతున్నారు. రాజ్యాంగ నిపుణుడైన గవర్నర్ కు టీడీపీ నేతలు సలహాలివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. సెలక్ట్ కమిటీలో ఉన్న బిల్లు పై గవర్నర్ సంతకం చేస్తే అది రాజ్యాంగ విరుద్దమని టీడీపీ నేతలు చెబుతున్నారు. కోర్టు తీర్పులను ధిక్కరించి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆరోపించారు.